
రాష్ట్ర విభజన అనంతరం 2014లో వచ్చిన ఎన్నికల వేళ కూడా వైసీపీ బలంగానే ఉంది. అంతేకాదు.. ఒక దశలో అప్పుడే జగన్ సీఎం అవుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే.. కొత్త రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలనే ఒకే ఒక్క ఆలోచనతో బాబుకు పగ్గాలు అప్పగించారని అంటారు విశ్లేషకులు. అనుభవం లేని జగన్ కన్నా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన బాబును సీట్లో కూర్చోపెట్టడమే మంచిదని జనాలు యోచించారని చెబుతారు. అయినప్పటికీ.. భారీగానే ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు జగన్. దేశంలో మోడీ గాలి వీచడం.. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ సైతం సహాయకారిగా నిలవడంతో బాబు గట్టెక్కారని అంటారు.
ఇదే నిజమని నిరూపించాయి 2019 ఎన్నికలు. అధికార పార్టీగా బరిలోకి దిగిన చంద్రబాబు ఎవ్వరూ ఊహించని విధంగా 23 స్థానాలకు పడిపోవడం నివ్వెర పరిచింది. ఈ దారుణ పరాభవాన్ని సాక్షాత్తూ చంద్రబాబు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇంత ఘోరంగా ఓడించే తప్పు తానేమీ చేయలేదని చెప్పుకోవడం ఆయన పరిస్థితికి అద్దం పట్టింది. ఆ బాధ నుంచి తేరుకున్నా.. ఆ తర్వాత కూడా సానుకూలమైన వాతావరణం ఇప్పటి వరకూ కనిపించలేదు.
పంచాయతీ ఎన్నికల్లో, మునిసిపోల్స్ ఘోరంగా ఓడిపోయింది టీడీపీ. తిరుపతి ఉప ఎన్నిక సైతం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో.. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మదన పడుతున్నారు బాబు. ఇప్పటికే పార్టీ కేడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. మరోసారి కూడా అధికారం కోల్పోతే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలకు మూడేళ్ల నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఏ విధంగా చూసినా.. సింగిల్ గా వైసీపీని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. అందుకే.. పొత్తుల కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వామ పక్షాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ ఉనికి పాట్లు పడుతున్నాయి. అటు కాంగ్రెస్ కూడా కోలుకున్నది లేదు. ఆ విధంగా వీళ్లతో కలిస్తే పెద్దగా ఉపయోగం లేదని భావిస్తున్నారట.
అందుకే.. మరోసారి 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలని చూస్తున్నారట. బీజేపీ-జనసేనతో కలిసి జగన్ ను ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మొన్న మహానాడులో చేసిన వ్యాఖ్యలు ఇదే అర్థాన్ని స్ఫురించాయని అంటున్నారు. కానీ.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అని తేల్చి చెప్పారు. జనసేన వైఖరి ఏంటన్నది అఫీషియల్ గా చెప్పలేదు. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు జట్టుగా ఉన్నాయి కాబట్టి.. ఒకే అభిప్రాయం వ్యక్తం చేశాయని అనుకున్నా.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటు మారుతాయో ఎవ్వరూ చెప్పలేరు. మొత్తానికి.. 2014 పొత్తులు రిపీట్ చేయాలని చూస్తున్నా.. సక్సెస్ రిపీట్ చేయగలరా? అసలు ఈ పొత్తులు కుదురుతాయా? అన్నది చూడాలి.