Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదా? పోటీ చేయకుండా ఉండడమే శ్రేయస్కరమని భావిస్తోందా? సరికొత్త రాజకీయ పరిణామాలతో ఈ ఆలోచనకు వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తును ప్రారంభించినా.. తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనంగా ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం తొలి జాబితాను విడుదల చేసింది. బిజెపి సైతం కసరత్తు చేస్తోంది. అయితే తెలుగుదేశం విషయంలో అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో ఆ పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
టిడిపి అనుకూల మీడియాలో కాంగ్రెస్ ఓటుకు తెలుగుదేశం పార్టీ గండి కొడుతోందని.. అటువంటిప్పుడు టిడిపి పోటీ నుంచి తప్పుకోవడమే మేలని భావిస్తోంది. మరోవైపు బిజెపి సైతం మద్దతు కోరుతుండడం.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వారి సాయం అనివార్యంగా మారడం కూడా మరో కారణం. ఇప్పటికే బీజేపీ జనసేనకు టచ్ లోకి వెళ్లడంతో.. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని కీలక స్థానాలను పోటీ చేయడం ఒక మార్గం. లేకుంటే పోటీ చేయకుండా బిజెపికి మద్దతు ప్రకటించడం రెండో మార్గం. ఎల్లో మీడియా చెబుతున్నట్లు చేయకుండా మౌనంగా ఉండడం మూడో మార్గం.అయితే టిడిపి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలిశారు. తెలంగాణలో టిడిపి పోటీకి కార్యాచరణ చేయాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పుకొచ్చారు. అటు తర్వాత బాలకృష్ణ తెలంగాణ టిడిపి సమీక్షలు నిర్వహించారు. కానీ ఇటీవల సైలెంట్ అయ్యారు. అటు లోకేష్ కానీ.. భువనేశ్వరి కానీ తెలంగాణ టిడిపి వైపు చూడడం లేదు. వారిద్దరూ ఏపీలోనే జనం మధ్యలోకి రావాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ లో పోటీ విషయంలో చంద్రబాబు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు పోటీ పెట్టకపోవడం మేలన్న భావనకు వస్తున్నట్లు సమాచారం.
ఏపీ తాజా పరిణామాలతో సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ పోటీలో ఉంటే ఆ రెండు వర్గాల ఓట్లు చీలిపోవడం ఖాయం. టిడిపి అనుకూల మీడియా ఇదే విషయాన్ని రాసుకోస్తోంది. అందుకే టిడిపి పోటీ చేయకుంటే కాంగ్రెస్కు భారీగా లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయితే ఇప్పుడు అన్ని పార్టీలు తెలుగుదేశం వైపు చూస్తున్నాయి. కానీ టిడిపి మాత్రం ఏపీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నడవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్నింటికీ మించి పోటీ చేయకపోవడం మేలన్న స్థిర నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.