Ramgopal Varma vs TDP : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు టిడిపి శ్రేణులనుంచి నిరసన తప్పడం లేదు. సోమవారం హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ కార్యాలయం ఎదుట టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి వెళ్లి గొడవ చేశారు. బయట ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీ సీఎం జగన్ జీవితం లో జరిగిన ఘటనలు ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను ప్రతికూల పాత్రల్లో చూపించారు. ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది.
ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని ఇప్పటికే నారా లోకేష్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు విజయవాడలో చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఏపీ క్యాబినెట్ మంత్రులతో సహా వైసిపి నేతలు హాజరయ్యారు. ఈవెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాను బ్యాంక్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లను ట్యాగ్ చేసి మరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.’ హేయ్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్.. నా ఆఫీసు బయట మీ కుక్కలు మొరుగుతున్నాయి. పోలీసులు రాగానే వాళ్ళు పారిపోయారు’ అని పోస్ట్లు వర్మ పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు టిడిపి కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. వర్మను తిట్టిపోస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను పొలిటికల్ గా టార్గెట్ చేస్తూనే నిర్మించారు. ఈ విషయాన్నివర్మ స్వయంగా వెల్లడించారు. వైసిపి నేత, టిటిడి బోర్డు మెంబర్ దాసరి కిరణ్ ఈ సినిమాను నిర్మించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించారు. మొదటి భాగం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.