TDP- Jana Sena: వచ్చే ఎన్నికలు అంత ఆషామాషీగా జరిగే పరిస్థితుల్లో లేవు. విపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ దూకుడు కనబరిచింది. అటువంటిది అధికారపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్న ఎన్నికలివి. అంత తేలిగ్గా తీసుకుంటుందని ఎవరు భావించరు. అందుకే టిడిపి, జనసేన ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతున్నాయి. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి వైసిపి దుశ్చర్యలను అడ్డుకోవాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాయి.
అయితే ముఖ్యంగా ఎన్నికల ముందు పొత్తులపై విషం చిమ్మేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. గత కొంతకాలంగా ఇదే ప్రయత్నాల్లో ఉంది. తనకున్న సోషల్ మీడియా సైన్యంతో రెండు పార్టీలు కలవకూడదని తొలుత ప్రయత్నాలు చేసింది. అవి సైతం వికటించాయి. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకుండా చూడాలని సరికొత్త కుట్రకు తెరలేపుతోంది.రెండు పార్టీల శ్రేణుల మధ్య గొడవలు సృష్టించి ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదని భావిస్తోంది. కుల, వర్గ, ప్రాంతీయ వైశమ్యాలను రెచ్చగొట్టేలా చూస్తోంది.
పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత జనసేనలోనే ధిక్కారస్వరాలు వినిపించాయి. అసలు పార్టీ జెండా పట్టుకొని వారు పనిగొట్టుకొని.. అధినేత ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. జనసేన లోని ప్రోవైసిపీ నేతలకు పని కల్పించారు. కాపు నేతలతో ఏకంగా పవన్ ను తిట్టించారు. టిడిపి తో పవన్ కలవకూడదన్నది వారి అభిమతం. దానికోసం ఎందాకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. కానీ దానిపై పవన్ ముందే మేల్కొన్నారు. జనసేన భావజాలం, వైసిపి విముక్త ఏపీ లక్ష్యాన్ని గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో చాలామంది ప్రో వైసీపీ నేతలు జనసేన ను వీడారు. తమ ముసుగును తొలగించుకున్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో తెలియంది కాదు. అందుకే టిడిపి, జనసేన సమన్వయ కమిటీ భేటీలో ముందుగా వైసిపి కుట్రలు, కుతంత్రాలపైనే చర్చించారు. ఈ విషయంలో రెండు పార్టీలు కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగించేలా రెండు పార్టీల్లో ఎవరు మాట్లాడినా తక్షణ చర్యలకు ఉపక్రమించాలని తీర్మానించుకున్నాయి. దీంతో వైసిపి ప్రయత్నాలకు చెక్ పడేలా ముందుగానే ఒక ప్రత్యేక కార్యాచరణకు రెండు పార్టీలు పూనుకోవడం విశేషం. దీంతో ఇది అధికార పార్టీకి ఝలక్ ఇచ్చినట్లు అయ్యింది. దీంతో అధికార పార్టీ నీరు గారి పోయింది. తమ ప్రయత్నాలు ఇక చెల్లవన్న ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది.