TDP And BJP- BRS: బీఆర్‌ఎస్‌ చేతిలో బీజేపీ జుట్టు.. కేసీఆర్‌కు మళ్లీ అస్త్రం ఇచ్చిన బాబు!

ఏపీలో జగన్‌ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబుకు అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు.

Written By: Raj Shekar, Updated On : June 6, 2023 12:42 pm

TDP And BJP- BRS

Follow us on

TDP And BJP- BRS: తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విపక్షాలే అస్త్రాలు ఇస్తున్నాయి. అవే బీఆర్‌ఎస్‌కు బలంగా మరుతున్నాయి. విపక్షాల ఓటమికి బాటలు వేస్తున్నాయి. ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనుకున్న బీజేపీ వేస్తున్న తప్పటడుగులు.. అధికార పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. తాజాగా చంద్రబాబు, అమిత్‌షా భేటీతో కేసీఆర్‌కు మరో అస్త్రం దొరికింది.

అనేక ప్రయత్నాల తర్వాత అపాయింట్‌మెంట్‌..
ఏపీలో జగన్‌ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబుకు అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. అయినా గెలుపుపై నమ్మకం కలగడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు కోరుతున్నాడు చంద్రబాబు. ఈ క్రమంలో అనేక ప్రయత్నాల తర్వాత అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ దొరికింది. వెంటనే ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కారు బాబు. అమిత్‌షా, నడ్డాతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రాలో పొత్తులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విషయం గోప్యంగా ఉంచినప్పటికీ ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది.

ఉమ్మడి రాజధాని కాలపరిమితి పెంపు..
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి టీడీపీ సహకారం అందిస్తుందని చెప్పినట్లు సమాచారం. ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉందని, ఆయా జిల్లాల్లో సీట్లు ఇస్తే చాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దీంతో పొత్తులతో బీజేపీ గెలుస్తుందని బీఆర్‌ఎస్‌ను గద్దె దించవచ్చని సూచించారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆంధ్రాలో లబ్ధి పొందడానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను మరో ఐదేళ్లు కొనసాగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌కు మళ్లీ అస్త్రం..
బీజేపీ, టీడీపీ పొత్తే ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు మళ్లీ అస్త్రంగా మారుతోంది. 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేశాయి. నాడు కేసీఆర్‌ సెంటిమెంట్‌ను రగిల్చి గెలిచారు. ఆంధ్రాబాబు మళ్లీ తెలంగాణకు అవసరమా, కాంగ్రెస్‌ టీడీపీ కూటమిని గెలిపిస్తే ఆంధ్రా వాళ్లు తెలంగాణపై పెత్తనం చేస్తారని, తెలంగాణను ఆంధ్రాల్లో కలుపుతారని కేసీఆర్‌ ప్రచారం చేశారు. కేసీఆర్‌ మాట నమ్మిన ప్రజలు మళ్లీ గులాబీ పార్టీకే పట్టం కట్టారు. నాడు కాంగ్రెస్‌ చేసిన ప్పునే.. ప్రస్తుతం బీజేపీ చేస్తోంది. నాటి పొత్తుల ప్రభావం గురించి తెలిసి కూడా తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయడం పెద్ద తప్పటడుగని అంటున్నారు. బీజేపీ ఓటమికి ఇదే పెద్ద అస్త్రం అవుతుందని, బీఆర్‌ఎస్‌కు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పొత్తు పొడుస్తుందా.. లేదా చూడాలి.