TDP- Janasena: తమిళనాడు, బిహార్ వంటి రాష్ట్రాలు రాజకీయ పగలు, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒకరు పవర్ లోకి వస్తే ప్రత్యర్థులను జైలుకు పంపితే కానీ నిద్రపోయేవారు కాదు. దాదాపు ఆ రాష్ట్రాల్లో హేమాహేమీలంతా జైలుకెళ్లి వచ్చిన వారే. అటు నిండు శాసనసభలో సైతం రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేసిన సందర్భాలున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను చూసి దేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల వారు అసహ్యించుకునేవారు. అయితే నేతల్లో వచ్చిన మార్పో, మానసిక పరివర్తనో తెలియదు కానీ అటువంటి రాష్ట్రాల్లో రాజకీయాలు స్వరూపమే మారిపోయాయి. కేవలం సైద్ధాంతిక విభేదాలే తప్ప.. వీలైనంతవరకూ వ్యక్తిగత వైరాన్ని తగ్గించుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో అటువంటి పరిస్థితే ఎదురవుతోంది. 2004 నుంచి ఈ సంస్కృతి పెరుగుతూ వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రారంభమైంది. వైఎస్ అనంతరం వచ్చిన పాలకులంతా అదే సంస్కృతిని కొనసాగించారు. జగన్ సర్కారు వచ్చాక అది పెచ్చుమీరింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఇప్పుడు చేస్తున్నదానికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం దేనికి సంకేతం?

2019 వైసీపీలోకి వచ్చిన తరువాత ఏ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు ఆడుకోవాలో ఆడుకున్నారు. ముఖ్యంగా టీడీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ సాగిన అరెస్ట్ లు, కేసుల పర్వం అంతా ఇంతాకాదు. దీంతో విపక్ష నేతలు కొద్దిరోజులు మౌనమే మేలన్న రీతిలోకి వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు? అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చి పోరాడుతున్నారు. దైర్యాన్ని పోగు చేసుకొని మరీ వైసీపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ‘అవసరం’ ఎంత పనికైనా తెగించేలా చేస్తుందన్న మాటను నిజం చేస్తూ టీడీపీ నేతలు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల టీడీపీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నాయకులు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి. అటు చంద్రబాబు సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు కూడా కసితో పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి దివి శివరాం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవకుంటే టీడీపీని ఉంచరు.. నేతలను బయట తిరిగినివ్వరు. మట్టుబెట్టేస్తారు అని హెచ్చరించారు. అందుకే మన మధ్య గొడవలు ఉంటే తరువాత చూసుకుందాం.. నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఉంటే ఒకరికొకరు సరెండర్ అయిపోదామంటూ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. బహు నాయకత్వం ఉన్న నియోజకవర్గ శ్రేణులు, నాయకుల్లో ఆలోచింపజేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేనంత కసి కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగానే ఫైట్ చేస్తున్నారు. అయితే వారికి తమ బలంపై నమ్మకం లేకుండా పోతోంది.తన సీనియార్టీని పక్కనపెట్టి మరీ చంద్రబాబు కాస్తా తగ్గుతున్నారు. పవన్ కోసం పడిగాపులు కాశారు. జనసేనతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తున్నారు.పొత్తుల ఎపిసోడ్ లో ఎక్కువగా చంద్రబాబు ఆరాటమే కనిపిస్తోంది. పొత్తుల కోసం తొలుత వ్యాఖ్యానించింది.. పావులు కదిపింది చంద్రబాబే. ఇప్పుడు అధినేత పరిస్థితిని చూస్తున్న టీడీపీ శ్రేణులు సైతం అదే కసితో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపడేయ్యాలన్న నిర్ణయానికి రావడం టీడీపీకి కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.