CM Jagan On Kuppam: రాష్ట్రంలో మరోసారి తిరుగులేని విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అధికారాన్ని మరోసారి హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా టీడీపీ కీలక నాయకుల నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి గెలుపొందాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల సమీక్షకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రత్యేకంగా పోకస్ పెట్టింది మాత్రం కుప్పంపైనే. అక్కడ చంద్రబాబును ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. అందుకే అక్కడి బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. స్థానిక సంస్థల విజయాన్ని ఫార్ములాగా తీసుకొని సాధారణ ఎన్నికల్లో అదే ఫార్ములాను అప్లయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలకు కీలక బాధ్యతలను అప్పగించారు కూడా. అయితే అభివృద్ధి మంత్రంతో నియోజకవర్గ ఓటర్లను చంద్రబాబు నుంచి దూరం చేయవచ్చన్న నేతల సూచన మేరకు కుప్పం నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులకు రూ.66 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు..
సీఎం జగన్ ఇక నుంచి కుప్పం నియోజకవర్గంలో వరుసగా పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు మంత్రులు, అధికారులు, వైసీపీ కీలక నేతల తాకిడి కుప్పంలో అధికంగా ఉంది. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్, సభా స్థలం సిద్ధం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు.సీఎం కుప్పం నియోజకవర్గ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులను సమీకరిస్తున్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అటు చంద్రబాబుకు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు గట్టి సంకేతాలు పంపాలని కృతనిశ్చయంతో వైసీపీ శ్రేణులు అక్కడ పనిచేస్తున్నాయి.
విపక్షాలకు గట్టి సంకేతాలు..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ అక్టోబరు నుంచి బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ యువ నేత నారా లోకేష్ జనవరి నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ ఒకటి బయటకు వచ్చింది. టీడీపీ నుంచి అధికారికంగా ప్రకటన రాకున్నా.. లోకేష్ పాదయాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం కానుందన్న వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. తమ కంటే విపక్షాలు దూకుడు పెంచడంతో జగన్ లో పునరాలోచన ప్రారంభమైంది. అందుకే విపక్ష నేత చంద్రబాబు సొంత గెడ్డ నుంచే సమరశంఖం పూరించి పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.
చంద్రబాబుకు బ్రేక్ వేసేలా…
చంద్రబాబు సుదీర్ఘ కాలం కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీల ఓట్లతో ఆయన తన విజయపరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడదే బీసీల్లో వ్యతిరేకత నింపి చంద్రబాబును ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే రూ.66 కోట్లతో కుప్పంమునిసిపాల్టీలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని నిరూపించడం ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిరోజులకిందట చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్న ప్రయత్నంలో గలాట చోటుచేసుకుంది. కానీ పోలీసులు మాత్రం టీడీపీ క్రియాశీలక నాయకులను అరెస్ట్ చేశారు. వారి రిమాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. సీఎం జగన్ పర్యటనను సక్సెస్ చేసుకోవడానికే వారి రిమాండ్ ను కొనసాగిస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. మొత్తానికి సీఎం జగన్ కుప్పం గెడ్డపై అడుగు పెట్టి చంద్రబాబుకు సవాల్ చేయనున్నారు.