Telangana Elections 2023: టార్గెట్‌ కాంగ్రెస్‌.. బీజేపీ లక్ష్యం ఆ నేతలే

ఐటీ దాడుల తీరుతో జనాల్లో కూడా బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విషయం ఏమిటంటే రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అన్ని పార్టీల తరపున పోటీలో ఉన్నారు.

Written By: Raj Shekar, Updated On : November 11, 2023 2:59 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఐటీ దాడులు మొదలయ్యాయి. ప్రధానంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఐటీ అధికారులు, ఎన్నికల షెడ్యూట్‌ ప్రకటించిన తర్వాత అప్పుడే నిద్రలేచినట్లుగా దాడులు మొదలు పెట్టారు. ఈ దాడులు కూడా ఏకపక్షంగా, ఒక పార్టీ నేతల టార్గెట్‌గానే జరుగుతన్నాయి. ఇప్పటి వరకు ఐటీ అధికారులు చేసిన దాడులన్నీ కాంగ్రెస్‌ నేతలపైనే కావడం గమనార్హం. అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజు కూడా దాడులు చేయడం నిస్సందేహంగా ఇది బీజేపీ టార్గెటే అన్న విషయం అందరికీ అర్థమవుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్‌ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విక్రాంత్‌రెడ్డితోపాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లపైన దాడులు జరిగాయి.

బీఆర్‌ఎస్‌ సూచనతోనే..
తెలంగాణలో మూడు పార్టీల నుంచి బడా నేతలు, పెద్దపెద్ద వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఐటీ దాడులు మాత్రం కేవలం కాంగ్రెస్‌ అభ్యర్ధుల మీదే జరగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ సూచనతోనే బీజేపీ కాంగ్రెస్‌ అభ్యర్థులను టార్గెట్‌ చేసిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు కూడబలుక్కునే కాంగ్రెస్‌ అభ్యర్ధులపైన ఐటి శాఖ ఉన్నతాధికారులతో దాడులు చేయిస్తున్నట్లు హస్తం పార్టీ అభ్యర్ధులు, నేతలు మండిపడుతున్నారు. నిజంగానే బీఆర్‌ఎస్‌–బీజేపీలు ప్రత్యర్ధిపార్టీలే అయితే రెండు పార్టీల అభ్యర్ధుల మీద కూడా దాడులు జరగాలి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అభ్యర్ధుల మీద దాడులు జరగకపోయినా కనీసం బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల మీదైనా జరగాలి కదాన్న ప్రశ్నకు రెండుపార్టీలు సమాధానం చెప్పలేకపోతున్నాయి.

ఐటీ దాడులపై అనుమానాలెన్నో..
ఐటీ దాడుల తీరుతో జనాల్లో కూడా బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విషయం ఏమిటంటే రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అన్ని పార్టీల తరపున పోటీలో ఉన్నారు. కానీ దాడులు మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్ధులను టార్గెట్‌ చేసుకున్నట్లుగా జరుగుతున్నాయి. పొంగులేటిని అయితే అధికారులు నామినేషన్‌ కూడా వేసుకోనీయకుండా అడ్డుకున్నారు. చివరకు అతికష్టం మీద రెండు గంటలు టైం తీసుకుని నామినేషన్‌ వేసి మళ్లి నామినేషన్‌ వేయాల్సి వచ్చింది.

ఓటమి భయంతోనేనా..
ఇలాంటి ఘటనలన్నీ కాంగ్రెస్‌ అభ్యర్ధులను వేధించటానికే అనే విషయం జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ అభ్యర్ధులను బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఏకమై ఐటీని ముందుపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కనబడుతోంది. ఇదే విషయాన్ని జనాలు కూడా నమ్ముతున్నారు. ఒకపుడు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమవ్వటంతోనే కవిత అరెస్టు జరగలేదన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు ఇపుడు జనాలకు గుర్తుచేస్తున్నారు. అలాగే రెండుపార్టీలు ఏకమయ్యాయని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.