NTR Coin: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఎన్టీఆర్ తన నటనతో మెప్పించడమే కాకుండా సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మహనేత శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద వంద రూపాయలు నాణెం ముద్రించింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిని సోమవారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబానికి కూడా ఆహ్వానం పంపించారు. నందమూరి కుటుంబం హాజరైంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం కొత్త చర్చకు కారణం అవుతోంది.
ప్రముఖుల హాజరు..
నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం 100 రూపాయల స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణాన్ని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటుగా నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సన్నిహితులు, దాదాపు 200 మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరితో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావించిన జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.
షూటింగే కారణమా..
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు కానీ, ఆయన హాజరు కాలేదు. కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. అంతకుముందు విజయవాడలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలో తారక్‌ను ఆహ్వానించకపోవడంపై అభిమానులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో దేవర షూటింగ్ కారణంగానే హాజరు కాలేదని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తారక్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పొత్తు ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చంద్రబాబు సభల్లోను తారక్ అభిమానులు ప్లెక్సీలు, జెండాలు ప్రదర్శిస్తున్నారు. ఫ్యూచర్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తారక్ హాజరు కాకపోవటం వెనుక సినిమా షూటింగ్ మాత్రమే కారణమా, లేక కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే అసలు కారణమా అనే చర్చ ఇప్పుడు సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. తాతపై ఎంతో అభిమానం ఉన్న తారక్.. శతజయంతి సందర్భంగా నిర్వహించిన, నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మందికి నచ్చడం లేదు.