ప్రముఖ ఆభరణాల సంస్థ ‘తనిష్క్’ అప్పట్లో విడుదల చేసిన ఒక యాడ్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.. మంచి ఉద్దేశంతోనే తీసినా.. రెండు మతాల ఏకత్వాన్ని చూపిస్తూ చేసిన ఈ యాడ్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జాతీయ వాదులు ఈ యాడ్ పై మండి పడి ట్రోల్స్ చేశారు. తనిష్క్ వాణిజ్య ప్రకటనతో ‘లవ్ జిహాద్’ను ప్రచారం చేస్తోందని సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ట్విట్టర్ లో అయితే ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు.
దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా ఆ యాడ్ ఉందన్న విమర్శలు రావడంతో తనిష్క్ ఆభరణాల సంస్థ వెనక్కి తగ్గింది. తన యాడ్ ను వెంటనే ఉపసంహరించుకుంది. తాజాగా దీపావళి నేపథ్యంలో తనిష్క్ మరో యాడ్ తీసి అదే రీతిలో విమర్శల పాలు కావడం గమనార్హం. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చరాదని.. కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని తనిష్క్ తన యాడ్ లో చూపించింది. ఈ దీపావళి యాడ్ కూడా తాజాగా వివాదాస్పదమైంది.
ఈ వివాదాన్ని అందిపుచ్చుకొని నెటిజన్లు తనిష్క్ పై భగ్గుమన్నారు. దీంతో వెంటనే తనిష్క్ ఈ యాడ్ ను కూడా తొలగించింది. అయినప్పటికీ నెటిజన్ల ఆగ్రహ జ్వాలలతో తనిష్క్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మళ్లీ ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరిట హ్యాష్ ట్యాగ్ ఉద్యమం వైరల్ అయ్యింది.
కర్ణాటకకు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సోషల్ మీడియా వేదికగా ఈ యాడ్ ను షేర్ చేసి ఫైర్ అయ్యారు. ‘హిందువుల పండుగలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని ఎందుకు చెబుతారు. ఒక వర్గం సంస్కృతి సంప్రదాయాలపై లెక్చర్లు ఇవ్వకూడదని.. మీకేంటి నొప్పి.. దీపావళికి దీపాలు వెలిగిస్తాం.. స్వీట్లు పంచుతాం.. బాణాసంచా కాలుస్తాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.దీంతో ఈ వివాదం మరోసారి దుమారం రేపింది. ఈసారి తనిష్క్ ఎలా కాచుకుంటుందో చూడాలి మరీ..
Why should anyone advice Hindus how to celebrate Our Festivals?
Companies must focus on selling their products, not lecture us to refrain from bursting Crackers.
We will light lamps, distribute sweets and burst green crackers. Please join us. You will understand Ekatvam. https://t.co/EfmNNDXWFD
— C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) November 8, 2020