
Tammineni vs Sharmila : ప్రతిపక్షాల మద్దతు అంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తొక్కని గడప లేదు.. సంప్రదించని నేత లేరు. కేసీఆర్ ను అర్జంటుగా గద్దెదించాలంటూ తెలంగాణ ప్రతిపక్షాలన్నీ కలవలంటూ షర్మిల ప్రతిపక్ష నేతలైన బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసింది. అంతటితో ఆగకుండా సీపీఎం ఆఫీసుకు వెళ్లి మరీ తమ్మినేని వీరభద్రంతో భేటి అయ్యింది. అయితే అంతటితో సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోయేదానికి సీపీఎం ఆఫీసుకెళ్లి మరీ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంనే తిట్టిపోసింది. ఇలా ఎవరైనా చేస్తారా? కేవలం షర్మిలకు మాత్రమే ఆ ఘనత దక్కుతుందని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
షర్మిల రాజకీయాల్లో దూకుడుగా ఉండడంలో తప్పులేదు. కేసీఆర్ ను గద్దెదించాలన్న ఆమె ప్రయత్నంలోనూ తప్పు లేదు. కానీ ప్రతిపక్ష నేతలకు తమ సిద్ధాంతాలు ఉంటాయని.. వారి వ్యూహం ప్రకారం వారు వెళతారన్న కనీస సృహను షర్మిల తెలుసుకోవాలి. అవేవీ ఆలోచించకుండా తనతో కలిసిరావడం లేదని సీపీఎం నేత తమ్మినేనిని ఆయన ఆఫీసులోనే తిట్టడం ఎంత వరకూ కరెక్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అఫ్ కోర్స్ షర్మిల ముందే తమ్మినేని కూడా ఇలానే ప్రశ్నించి చురకలు వేశాడు.
సీపీఎం కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటి అయ్యింది. అనంతరం తెలంగాణ ప్రతిపక్షాల కోసం షర్మిల ఏర్పాటు చేసిన ‘టీ సేవ్’ఫోరంలో భాగస్వాములు కావాలని సీపీఎంను షర్మిల ఆహ్వానించింది. అంతవరకూ ఓకే.
కానీ సీపీఎం ఆఫీసులోనే షర్మిల నోరుపారేసుకుంది. తమ్మినేనిని తిట్టిపోసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులే బీఆర్ఎస్ కు బీటీం గా పనిచేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలకు సీరియస్ అయిన తమ్మినేని వీరభద్రం అక్కడే ఆమె ముందే కౌంటర్ ఇచ్చారు.
‘రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న మర్యాదతో షర్మిలను కలుస్తామనగానే అంగీకరించామని.. అయితే ఇచ్చిన మర్యాదను షర్మిల నిలబెట్టుకోలేదని.. మునుగోడులో మేం బాహాటంగానే టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చాం. దేశ రాజకీయ అవసరాల దృష్ట్యా తమ రాజకీయ వైఖరి ఉంటుంది.. షర్మిల మాట్లాడినట్టు మేం మాట్లాడలేం. తమకు విజ్ఞత, మర్యాద ఉంటుంది. తమ ఆఫీసుకు వచ్చి తమను బీటీం అని విమర్శించే సాహసం సరికాదు.. బీజేపీకి బీటీం వైఎస్ఆర్ టీపీ’ అంటూ షర్మిల ముఖం మీదే తమ్మినేని గట్టి కౌంటర్ ఇచ్చారు.
షర్మిల ఏకంగా సీపీఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ఆ పార్టీ నేత తమ్మినేనిపై మాటల దాడి చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇలాంటి ధోరణి సరికాదంటూ చాలామంది హితవు పలుకుతున్నారు.