Tammineni Sitaram: తమ్మినేని సీతారాం కు జగన్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని తేల్చేశారు. ఆముదాలవలస టికెట్ ను ఓ మహిళ నేతకు కట్టబెడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావడంతో తమ్మినేని మనస్తాపానికి గురయ్యారు. ఆసుపత్రి పాలయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇప్పుడు తమ్మినేని పరిస్థితి ఏంటి? అనేదానిపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. మిగతా పార్టీలకు వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఆయనది.
చాలా ఏళ్ల తర్వాత గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయినా మంత్రి పదవిపై ఆశ చావని తమ్మినేని ఓ రేంజ్ లో చంద్రబాబుపై విరుచుకుపడేవారు. ఎంతలా తిడితే విస్తరణలోనైనా జగన్ ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా టిక్కెట్ లేదని తేల్చేశారు. బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబానికి చెందిన పద్మజ అనే మహిళ నేతకు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన తమ్మినేని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
తాను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న విషయం కూడా తమ్మినేని మరిచిపోయారు. ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేశారు. తనకు కాకుంటే తన కుమారుడికి టికెట్ ఇస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ జగన్ హ్యాండిచ్చారు. కనీసం తన సీనియారిటీని గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ్మినేని కుటుంబ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆమదాలవలసలో వైసీపీ అభ్యర్థి గెలుపొందితే మీకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెడతానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇది ఎంతవరకు నమ్మశక్యమని తమ్మినేని అనుమానిస్తున్నారు. పైగా నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉంది. ఒకవేళ తమ్మినేని సహకరించి వైసిపి అభ్యర్థి ఓడిపోయినా జగన్ పక్కన పడేస్తారని.. అసలు వస్తుందని తమ్మినేని భావిస్తున్నారు.
కనీసం టిడిపిలో చేరుతానని భావించినా అది సాధ్యం కాదు. చంద్రబాబును ఎంతలా దూషించాలో.. ఎంతలా వేధించాలో అంతా చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పై వ్యక్తిగత దాడి చేసినప్పుడు కూడా కనీసం నియంత్రించలేని స్థితిలో తమ్మినేని ఉన్నారు. పైగా శాసనసభ్యులను ప్రోత్సహించారు. స్పీకర్ పదవిలో ఉంటూ చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు తమ్మినేని టిడిపిలోకి వస్తామన్నా ఆహ్వానించేవారు లేరు. అటు జనసేనలో సైతం చేరలేరు. తమ్మినేని ముందున్న ఒకే ఒక పార్టీ బిజెపి. కానీ ఏపీలో బీజేపీ అంతంత మాత్రమేనని తమ్మినేని తెలుసు. అందుకే కక్కలేక మింగలేక లో లోపల బాధపడుతూ ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. మరి తమ్మినేని సీతారాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.