MLC Elections: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు ఉంది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న గులాబీ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రతిపక్షానికే పరిమితం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 11 మంది అభ్యర్థులను మార్చింది. ముగ్గురు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. ముగ్గురూ గెలిచారు. దీంతో ముగ్గురూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
మూడూ కాంగ్రెస్ ఖాతాలోకే..
ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. మూడు ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి స్థానాలకు ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈసీ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించింది. దీంతో బీఆర్‌ఎస్ మైండ్ బ్లాంక్ అయింది. ఈమేరకు ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది.
11న నోటిఫికేషన్..
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఈనెల 11న నోటిషికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇక పార్టీల బలాలు చూస్తే.. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు 39 మంది మాత్రమే ఉన్నారు. అయినా ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి రెండో స్థానం బీఆర్‌ఎస్‌కు వస్తుందని అంతా భావించారు.
ట్విస్ట్ ఇచ్చిన ఈసీ..
ఇక్కడే ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. రెండు స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ప్రతీ ఎమ్మెల్యేకు ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఛాన్స్ వస్తుంది. అదే జరిగితే రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఒక వేల ఒకే నోటిఫికేషన్ ఇచ్చినా ఎంత మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సపోర్టుగా ఉంటారనేది చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరం అయినా రెడీగా ఉంటానని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గతంలోనే ఆఫర్ ఇచ్చారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.