Bharadwaja Thammareddy: కమ్యూనిస్టు భావజాలాలు ఉన్న దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కానీ గత కొన్నేళ్లుగా వైసిపి భావజాలాన్ని వంట పట్టించుకున్నట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసేవారు. అప్పటినుంచి వాటినే కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి బాహటంగానే మద్దతు తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రత్యేక హోదాను జగన్ పక్కన పడేసినా…కుహనా మేధావిగా పేరు తెచ్చుకున్న తమ్మారెడ్డి భరద్వాజ కనీసం స్పందించలేదు. ఇటీవల జనసేనతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. వారి గురించి చులకనగా మాట్లాడుతున్నారు. తాజాగా తెలుగుదేశంతో జనసేన పొత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కు అంత సీన్ లేదని భరద్వాజ తేల్చేస్తున్నారు. పవన్ కు అభిమానులైతే ఉన్నారు కానీ వారంతా ఓట్లు వేయరని చెప్పుకొస్తున్నారు. అటువంటి నాయకుడుతో టిడిపి పొత్తు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన పార్టీనే గెలిపించుకోలేడు.. తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించడం తప్పేనని చెబుతున్నారు. తనకు అభిమానులైతే ఉన్నారని.. అందరూ ఓట్లు వేయరు అన్న విషయం పవనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేస్తున్నారు. 45 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ బలహీనమైందని పవన్ చెబుతున్నారని… అసలు బలమేలేని పవన్ చేతికి టిడిపి బాధ్యతలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సైతం ఇష్టం లేదని.. టిడిపిని దిక్కులేని పార్టీగా పవన్ అభివర్ణించడం ఏమిటని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు.
అయితే తమ్మారెడ్డి భరద్వాజ పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు చిరంజీవి కుటుంబాన్ని సైతం విడిచిపెట్టలేదు. ఆ మధ్యన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ఆస్కార్ పురస్కారాలు లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలుగు దర్శకుడుగా గర్వపడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ ప్రమోషన్ కు దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై నాగబాబు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. భరద్వాజను టార్గెట్ చేసుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజలో ప్రొవైసిపి భావజాలం ఎక్కువ. ఒక పోసాని కృష్ణ మురళి, కత్తి మహేష్, శ్రీ రెడ్డి మాదిరిగా ఆయన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన సినిమాలను విడిచిపెట్టారు. అలా అనేదానికంటే ఆయన చేతుల్లో సినిమాలంటూ ఏమీ లేవు. అప్పుడెప్పుడో 90వ దశకంలో కొన్ని చిత్రాలను దర్శకత్వం వహించారు. మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మాటలను అటు జన సైనికులు లైట్ తీసుకుంటున్నారు.