Governar Amith Shaw: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో టీఆర్‌ఎస్ కొట్లాట షురూ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ముందే వైద్యం పేరుతో ఢిల్లీ చేరుకున్నారు. ఈ కీలక సమయంలో గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం.. ఆమె కలవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో తాజా పరిణామాలను ఆమె ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. ప్రొటోకాల్ వివాదంపైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరగగా.. గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం నిర్వహించడాన్ని కూడా మోడీ, షాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ను ఇరుకునపెట్టడమే ధ్యేయంగా తమిళి సై ఈ రాజకీయం మొదలుపెట్టినట్టు తెలిసింది.
– అమిషాతో భేటీ..
పంటి నొప్పికి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు వచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్‌ను రాష్ట్రంలో ఎవరూ పట్టించు కోవద్దు అన్నట్లుగా కేసీఆర్ హుకూం జారీ చేశారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు కూడా గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించడం లేదు. ఇటీవల సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లిన సందర్భంగా మంత్రులతోపాటు అధికారులెవరూ ఆమెకు స్వాగతం పలికేందుకు రాలేదు. తాజాగా ఉగాది సందర్భంగా గవర్నర్ యాదాద్రి వెళ్లారు. ఈ సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఈవో గీతకు ముందస్తు సమాచారం అందించారు. అప్పటి వరకు ఆలయంలో ఉన్న ఈవో గీత గవర్నర్ వస్తున్నారని తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్చకులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. గవర్నర్ యాదాద్రి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈవో తిరిగి ఆలయానికి వచ్చారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీకి తొత్తులుగా మారడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అమిషాతో భేటీ కానున్న గవర్నర్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.
-కీలకం కానున్న గవర్నర్ నివేదిక..
ట్రబుల్ షూటర్‌గా పేరున్న కేంద్ర హోంమంత్రి అమిషాకు రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర తమిళిసై ఇచ్చే నివేదిక కీలకం కానున్నట్లు తెలిసింది. గవర్నర్ నియామకం తర్వాత మొదట కేసీఆర్ ఆమెతో సఖ్యతగానే ఉన్నారు. కౌషిక్‌రెడ్డి ఎమ్మెల్సీ నియామకం నాటి నుంచి ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య గ్యాప్ మొదలైంది. ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రొటోకాల్ కూడా పాటించకపోవడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గవర్నర్ నివేదిక ప్రస్తుతం కీలకంగా మారనుంది. తెలంగాణపై దృష్టి పెడుతున్న అమిత్ షా గవర్నర్ నివేదిక ఆధారంగా తదుపరి అడుగు వేసే అవకాశం ఉంది. కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్ ఢిల్లీ పర్యటనపై ఉంది.