ఆ మధ్య కర్నాటక బీజేపీ నేత అశ్లీల వీడియోల వ్యవహారం ఎంత సంచలనం రేకెత్తించిందో తెలిసిందే. తాజాగా.. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత అడ్డంగా బుక్కయ్యారు. సొంత పార్టీకే చెందిన మహిళా నేతతో ఆయన జరిపిన వీడియో కాల్ సంభాషణ బయటకు వచ్చింది. ఆయన అర్ధనగ్నంగా కూర్చొని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆయన సాదాసీదా నాయకుడు కాదు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్. అలాంటి నేత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. అయితే.. ఈ వ్యవహారాన్ని బీజేపీకే చెందిన మరో నేత బయట పెట్టడం గమనార్హం. గతేడాది అక్టోబరులో బీజేపీలో చేరిన రవిచంద్రన్ ఈ వీడియో కాల్ ను లీక్ చేశారు. అంతేకాదు.. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆమోదంతోనే రాఘవన్ వీడియోను బయట పెట్టానని రవిచంద్రన్ చెప్పడం గమనార్హం.
దీనిపై రాఘవన్ స్పందించారు. తనపై, పార్టీపై బురద చల్లేందుకే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ కావడం, విమర్శలు చుట్టుముట్టడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాఘవన్ రాజీనామా చేశారు. తాను గడిచిన 30 ఏళ్లుగా బీజేపీ కోసం నిస్వార్థంగా పనిచేశానని, తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే.. రవిచంద్రన్ మరో బాంబు పేల్చారు. బీజేపీకి చెందిన మరో 15 మంది నేతల ఆడియో, వీడియో టేపులు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా రాఘవన్ మాదిరిగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. వారిపై పార్టీ తగిన యాక్షన్ తీసుకోవాలన్నారు. లేకపోతే.. వాటిని కూడా బయటపెడతానని రవిచంద్రన్ హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఆ వీడియోలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోరగా.. రవిచంద్రన్ ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. దీనిపై అన్నామలై అసహనం వ్యక్తంచేశారట. ఆధారాలు చూపకుండా వారిపై చర్యలు ఎలా తీసుకోవాలని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఇటీవల బీజేపీ కార్యదర్శి సీటీ రవికి పలువురు మహిళా నేతలు ఫిర్యాదులు చేశారు. తమను ఒక నేత లైంగిక వేధిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు రాఘవన్ వ్యవహారం బయటకు రావడం సంచలనం రేకెత్తిస్తోంది. మరి, బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోచూడాలి.