Tamil language fandom: తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. వారు ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా.. తమిళంలోనే మాట్లాడుతారు. తమిళం తప్ప ఏ భాషను బలవంతంగా నేర్చుకోరు. ముఖ్యంగా హిందీ భాషను అస్సలు సహించరు. ఇప్పటికే కేంద్రానికి, తమిళనాడు మధ్య ఈ విషయంలో యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తమిళనాడులో భాషాభిమానం ఎంత గట్టిదో, ఒక్క అక్షరం తేడా వచ్చినా ఎంత తీవ్రంగా స్పందిస్తారో కళ్లకురిచ్చి బస్సు డిస్‌ప్లే స్క్రీన్‌పై ‘అరుణాచలం’ అనే పేరు కనిపించిన సంఘటన మరోసారి నిరూపించింది. ఈ చిన్న ‘తప్పిదం’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఒక కండక్టర్‌ను సస్పెన్షన్‌కు దారితీసింది.
ఒక అక్షర యుద్ధం..
తమిళనాడులోని కళ్లకురిచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రభుత్వ బస్సు డిజిటల్ తెరపై ‘తిరువణ్ణామలై’ బదులు ‘అరుణాచలం’ అని ఆంగ్ల అక్షరాల్లో ప్రదర్శించారు. అది కేవలం పేరు తప్పు కాదు, తమిళ గుండెలపై దాడిలా మారింది! సోషల్ మీడియా యోధులు సెల్ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసి, ఈ ‘అపరాధాన్ని’ వైరల్ చేశారు. ఒక్క స్క్రీన్‌షాట్‌తో భాషాభిమానం జ్వాలలు చెలరేగాయి. ఒక సామాజిక కార్యకర్త, ఈ ‘అరుణాచలం’ పేరును చూసి, రవాణా సంస్థను ప్రశ్నించడంతో డ్రామా మరింత ముదిరింది. రవాణా అధికారులు వెంటనే కృతజ్ఞతలు తెలిపి, లేఖలు రాసి, పేరును తిరువణ్ణామలైగా మార్చారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒక డిజిటల్ స్క్రీన్‌పై పేరు మార్చడం కోసం ఇంత సీరియస్‌గా రియాక్ట్ చేయడం! తమిళ భాషాభిమానం ఒక బస్సు డిస్‌ప్లే స్క్రీన్‌ను కూడా క్షమించదని ఈ ఘటన నిరూపించింది.
Also Read: మోదీ మళ్లీ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారే..!
కండక్టర్ సస్పెన్షన్..
ఈ డ్రామాలో అసలు బాధితుడు కళ్లకురిచ్చి కండక్టర్ విజయరాఘవన్! ‘అరుణాచలం’ అనే పేరు డిస్‌ప్లే కావడానికి అతను ఏం చేశాడో ఏమో, కానీ రవాణా సంస్థ విళుపురం జోన్ జనరల్ మేనేజర్ జయశంకర్ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క అక్షరం తప్పు వల్ల ఒక ఉద్యోగం పోవడం ఇదే మొదటిసారి కాదు కదా? తమిళ భాషాభిమానం ఒక కండక్టర్ జీవితాన్ని కూడా డిజిటల్ స్క్రీన్‌లా మార్చేస్తుంది.
అధికారుల చర్యలు…
అధికారులు వెంటనే స్పందించి, బస్సు డిస్‌ప్లేలపై ‘తిరువణ్ణామలై’ పేరును తిరిగి చేర్చారు. అంతేకాదు, ఇకపై ఈ రూట్‌లోని అన్ని బస్సుల్లో తప్పనిసరిగా ‘తిరువణ్ణామలై’ అనే పేరే ఉండాలని కండక్టర్లకు సూచించారు. ఒక బస్సు డిస్‌ప్లే స్క్రీన్ కోసం ఇంత హడావిడి చేయడం, అధికారులు లేఖలు రాయడం, సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేయడం గమనార్హం.