Hazara Minority: అఫ్గనిస్తాన్ (Afghanistan) రక్తసిక్తమవుతోంది. కరడుగట్టిన తాలిబన్లు (Taliban) రక్తపాతం సృష్టిస్తున్నారు. అఫ్గాన్ ను ఆక్రమించుకున్న కొద్ది కాలంలోనే మారణహోమం చేసింది. హజారా మైనారిటీ (Hazara minority) కమ్యూనిటీకి చెందిన 14 మందిని తాలిబన్లు కాల్చి చంపారు. వారిలో 12 మంది అఫ్గాన్ సైనికులు కాగా ఇద్దరు సాధారణ పౌరులున్నారు. తాలిబన్ల ఆధిపత్యాన్ని హజారా మైనార్టీలు ప్రజలు అంగీకరించకపోవడంతో తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
తాలిబన్ల అరాచకానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ లో పాలన గాడితప్పుతుందని ముందే హెచ్చరికలు చేసిన సందర్భంలో అనుకున్న విధంగానే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
హజారా మైనార్టీలను తాలిబన్లు శత్రువులుగా భావిస్తారు. అఫ్గానినిస్తాన్ సైన్యంలో హజారా మైనార్టీ వర్గానికి చెందిన వారిని నియమించుకున్నారు. దీంతో తాలిబన్ల లక్ష్యం హజారాలే. అఫ్గాన్ చరిత్రలో హజారా మైనార్టీలను అణచివేత వర్గంగా గుర్తిస్తారు. హజారాలు షియా మతస్తులు కావడంతో తాలిబన్లు వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.
అఫ్గనిస్తాన్ లో శాంతియుత వాతావరణం ఏర్పడాలంటే తాలిబన్లు సహకరించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సైతం తీర్మానం చేసింది. జరగబోయే పరిణామాలను భద్రతా మండలి ముందే ఊహించింది. అఫ్గాన్ ఉగ్రవాదులకు స్థావరంగా మారకూడదని సూచించింది. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ టెర్రరిజాన్ని ప్రేరేపించేలా కార్యకలాపాలు ఉండకూడదని పేర్కొంది.
అఫ్గనిస్తాన్ ఉగ్రవాదుల అడ్డాగా మారబోతోందని తెలుస్తోంది. దేశం నుంచి అమెరికా సేనలు వైదొలగడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. తాలిబన్ల ఆగడాలకు అడ్డాగా మారుతోంది. అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలు పెట్రేగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అఫ్గాన్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ పరిస్థితి ఎటు వైపు వెళుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.