అఫ్గనిస్తాన్ లో రాక్షస పాలన సాగుతోంది. ఒళ్లు గగుర్పొడిచేలా తాలిబన్ల రాక్షసత్వం మరోసారి బయటపడుతోంది. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా వారి కృత్యాలుంటున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూడళ్ల వద్ద మృతదేహాలను వేలాడదీస్తూ వారిలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్ పట్టణంలోని ఓ ప్రధాన కూడలి వద్ద క్రేన్ సాయంతో శనివారం ఓ వ్యక్తి శవాన్ని వేలాడదీసి వారి నైజం ప్రదర్శించుకున్నారు. దీన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. తాలిబన్ల ఆకృత్యాలకు అంతేలేకుండా పోతోంది.

అయితే చనిపోయిన వారు కిడ్నాప్ కు యత్నించినట్లు తెలుస్తోంది. తండ్రి కొడుకులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను తాలిబన్లు పట్టుకుని చంపినట్లు తెలుస్తోంది. అయితే వారి శవాలను మాత్రం ఇలా బహిరంగ ప్రదేశాల్లో వేలాడదీయడంతో ప్రజలు భయపడుతున్నారు. ఒక శవాన్ని హెరాత్ పట్టణంలో మిగిలిన శవాలను సైతం పలు ప్రాంతాల్లో వేలాడదీసేందుకు తీసుకెళ్లినట్లు తెలుస్లోంది. దీంతో ప్రజల్లో భయం పట్టుకుంది.
దీనిపై తాలిబన్ ప్రభుత్వం నియమించిన హెరాత్ జిల్లా పోలీస్ చీఫ్ జియావుల్ హక్ జలానీ మాట్లాడుతూ నలుగురు కిడ్నాపర్ల నుంచి తండ్రీ కొడుకులను రక్షించి దుండగులను చంపినట్లు వెల్లడించారు. కిడ్నాపర్లు జరిపిన కాల్పుల్లో ఓ తాలిబన్ ఫైటర్ కూడా గాయపడినట్లు చెప్పారు. ఎదురు కాల్పుల్లో నలుగురిని హతమార్చినట్లు తెలిపారు. కానీ ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. వారు చెప్పిందే నమ్మశక్యంగా లేదనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
అఫ్గనిస్తాన్ లో 1990 నాటి శిక్షలు ఇప్పుడు కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఏ దేశం కూడా మాకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ చట్టాలకు అనుగుణంగా తాము పాలన చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇతర దేశాల చట్టాల గురించి తాము మాట్లాడనప్పుడు మా దేశ చట్టాల గురించి ఇతరులు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.