
గడిచిన వారం రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రమైన అలజడి నెలకొంది. తాలిబన్లు ఆఫ్ఘన్ ను పూర్తిగా ఆక్రమించుకోవడంతో.. అక్కడి ప్రజలతోపాటు విదేశీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి బయటపడేందుకు విదేశీ పౌరులతోపాటు ఆఫ్ఘన్ ప్రజలు సైతం అన్ని దారులూ వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు.
ప్రజలంతా రోజూ మాదిరిగానే ఎవరి పనులు వారు చేసుకోవాలని చెప్పారు. ‘‘దేశంలోని ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. కాబట్టి.. మీరంతా పూర్తి నమ్మకం, భరోసాతో జీవించండి. ప్రజలంతా రోజూవారి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరు కావాలి’’ అని ఓ ప్రకటనలో కోరారు.
తాలిబన్ల నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంచలనంగా మారింది. నిజానికి తాలిబన్లు ఉచ్చరించిన తొలి శాంతి మంత్రంగా దీన్ని భావించొచ్చు. ఎందుకంటే.. ఎంత సేపూ కఠిన షరియా చట్టాల గురించే వారు మాట్లాడుతుంటారు. మధ్యయుగం నాటి న్యాయసూత్రాలను, మత విశ్వాసాలను పాదుకొలిపేందుకు ప్రయత్నించే తాలిబన్లు.. తమ నిర్ణయాలకు ఎవరైనా ఎదురు తిరిగితే తెగనరుకుతారు. బుల్లెట్లతో ఒళ్లు జల్లెడ పడతారు. అలాంటి వారు ఈ తరహా ప్రకటన చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే.. రెండు రోజుల క్రితం అమెరికా విమానం ఎక్కేందుకు వందలాది మంది ఆఫ్గన్లు రన్ వేపై పరుగులు తీయడమే కాకుండా.. కొందరు విమానం రెక్కలపైనా ఎక్కి కూర్చొని.. గాల్లోకి ఎగిరిన తర్వాత నేలరాలి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిందనే చెప్పాలి. దీంతో.. తాలిబన్ల అరాచకత్వం మరోసారి చర్చలోకి వచ్చింది. ఆఫ్గన్ ప్రజల్లో ఎంత భయం లేకపోతే.. ప్రాణాలను లెక్క చేయకుండా ఇలాంటి సాహసం చేస్తారు? అనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని కూల్ చేసేందుకు అన్నట్టుగా తాలిబన్లు ఈ తరహా ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని, పర్మిషన్ లేకుండా ఎవరిపైనా దాడి చేయొద్దని తాలిబన్ ఫైటర్లను ఆదేశించామని ప్రకటించారు. ప్రజల ప్రాణాలతోపాటు వారి గౌరవాన్ని, ఆస్తులను కూడా పరిరక్షించాలని వారికి సూచించామని తాలిబన్ అధికార ప్రతినిధి షహీన్ ట్విటర్ లో ప్రకటించారు. మరి, ఈ ప్రకటన ఎన్నాళ్లు అమల్లో ఉంటుందో చూడాలి.