
ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి ఆఫ్ఘనిస్తాన్ పైనే ఉంది. ఆ దేశాన్ని తాలిబన్లు తిరిగి కైవసం చేసుకోవడంతో.. ప్రజలు భీతిల్లిపోతున్నారు. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తూ.. మంచినీళ్లు తాగినంత సులువుగా హత్యలు చేస్తుంటారు తాలిబన్లు. అలాంటి వారి నుంచి తప్పించుకునేందుకు విదేశీయులు మాత్రమే కాదు.. ఆఫ్ఘన్ ప్రజలు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశం విడిచిపోయేందుకు అమెరికా విమానం రెక్కల మీద ప్రయాణించి, కొందరు జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంతో.. చలించిపోయిన ప్రపంచ దేశాలు ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. భారత్ సహా.. పలు దేశాలు వారికి ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
తాలిబన్ల పాలనను రెండు దశాబ్దాల క్రితమే రుచి చూసిన ఆఫ్గన్ ప్రజలు.. ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దేశం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ మూతపడింది. ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. విదేశీయులతో సహా ఆ దేశంలో చిక్కుకున్న ఆఫ్ఘన్ పౌరులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడే మార్గం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని పౌరుల పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. తీసుకోవాల్సిన చర్యలపై నాటో, ఇతర అంతర్జాతీయ సంస్థలతో చర్చిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన తాలిబన్లు సరికొత్త ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని, అందరూ స్వేచ్ఛగా తమపనులు తాము చేసుకోవచ్చని ప్రకటనలు జారీచేస్తున్నారు. ఉద్యోగస్తులు సహా.. అందరూ రోజూవారి కార్యక్రమాలు ఎలా కొనసాగించారో.. అలాగే పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకూ చొరపడొద్దని తాము.. తాలిబన్ ఫైటర్లకు ఆదేశాలు జారీచేసినట్టు చెబుతున్నారు. కానీ.. ప్రజలకు మాత్రం నమ్మకం కుదరట్లేదు. వీలైనంత త్వరగా అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ పౌరులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ముందుగా తమ పౌరులను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు.. ఆఫ్గన్ పౌరులకు సైతం ద్వారాలు తెరుస్తున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో తలదాచుకునేందుకు రావాలనుకుంటున్న ఆఫ్గన్ పౌరుల కోసం కొత్తరకం వీసాను ప్రకటించింది.
ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా పేరుతో ఎలక్ట్రానిక్ వీసాను అందుబాటులోకి తెచ్చింది. భారత్ రావాలని అనుకుంటున్న ఆఫ్గన్ పౌరులు అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీన్ని వెంటనే క్లియర్ చేసేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగానికి భారత సర్కారు ఆదేశాలు జారీచేసింది. అటు బ్రిటన్ సర్కారు మరో అడుగు ముందుకేసి.. ఏకంగా వీసాతో పనిలేకుండా తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది. విమానాల్లో కానీ.. భూ మార్గంలో కానీ బ్రిటన్ కు రావొచ్చని తెలిపింది. మరికొన్ని దేశాలు సైతం ఆఫ్ఘన్ ప్రజలకు చేయూతనిచ్చేందుకు, వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. మరి, దీనిపై తాలిబన్లు ఏమైనా కొర్రీలు పెడతారేమో చూడాలి.