ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల సొంతమైంది. నిన్న రాజధాని కాబూల్ ను వశపరుచుకోవడంతో దేశం మొత్తాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నట్టైంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశం మొత్తాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడం గమనార్హం.
అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయాడు. రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో అష్రఫ్ ఘనీ పేర్కొన్నాడు.
తాలిబన్లు దేశ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. వందలాది మంది తాలిబన్లు పెద్ద సైన్యంలా నగరంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ భవనాలపై తమ జెండాలను పాతుతున్నారు. లూటీలకు పాల్పడుతున్నారు.
తాలిబన్లు కాబూల్ లోకి ప్రవేశించినప్పటి నుంచి కాబుల్ కాల్పులతో మారుమోగిపోతోంది. పేలుళ్లతో హోరెత్తిపోతోంది. అమెరికా రాయబార కార్యాలయం, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారిక నివాసం వద్ద భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.
ఇక అమెరికా సైన్యం కాబూల్ లో మోహరించింది. తన రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను తరలిస్తోంది. వారికి రక్షణగా ఇప్పటికే ఆరువేల ట్రూపులను కాబూల్ లో మోహరించింది. ఈ సంఖ్యను మరింత పెంచనుంది. అమెరికా రాయబార ఉద్యోగులను , వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా కాబుల్ విమానాశ్రయానికి తరలించింది.
తాలిబన్లకు భయపడి వందలాది మంది స్థానికులు దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గుంపులు గుంపులుగా కాబూల్ విమానాశ్రయానికి వస్తున్నారు. విమానాశ్రయానికి వచ్చే రోడ్లన్నీ స్థానికులతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రక్తపాతానికి తావు లేకుండా దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దీంతో అక్కడి ప్రభుత్వం కూలింది. ఇప్పుడు అధికార మార్పిడి సజావుగా సాగడానికి మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా, ముజాహిదీన్ మాజీ నేత గులాబుద్దీన్ హెక్ మట్యార్ తో కూడిన ఓ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. తాలిబన్ల ప్రతినిధులతో వీరు చర్చించి ప్రభుత్వాన్ని అప్పగించాలన్నది వారి ఆలోచన. అయితే క్రూరమైన తాలిబన్లు ఈ కమిటీని పట్టించుకుంటారా? లేదా అన్నది వేచిచూడాలి.
అప్ఘనిస్తాన్ పౌరులు తలదాచుకోవడానికి దాని సరిహద్దు దేశాలు సరిహద్దులను తెరిచి ఉంచాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇక తమ దేశంలోకి రావడానికి ప్రత్యేక వీసాలను అప్ఘనిస్తాన్ పౌరులకు ఇస్తామని అమెరికా తెలిపింది. తాలిబన్లు స్వేచ్చ స్వాతంత్ర్యాలతో పాలన సాగించాలని.. రక్తపాతం చేయవద్దని అమెరికా, బ్రిటన్ సూచించాయి.
From Kabul airport
pic.twitter.com/00W74NEptF— Bruno Maçães (@MacaesBruno) August 15, 2021