భారత్ ను కుదిపేస్తున్న ‘మర్కజ్‌’ ప్రకంపనలు

మూడు వరాల పాటు లాక్ డౌన్ ను ప్రకటించడంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నదని దేశ ప్రజలు ఊపిరి పీల్చుకొంటున్న సమయంలో భారత్ ను ఇప్పుడు ‘మర్కజ్‌’ ప్రకంపనలు కుదిపివేస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతం.. దేశంలో కరోనా వ్యాప్తికి తాజా కేంద్రంగా మారింది. ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మతసంబంధ కార్యక్రమాలలో దేశ, విదేశాల నుండి భారీ సంఖ్యలో పాల్గొనడంతో వారిలో కొందరి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందినదని, వారి ద్వారా […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 12:49 pm
Follow us on

మూడు వరాల పాటు లాక్ డౌన్ ను ప్రకటించడంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నదని దేశ ప్రజలు ఊపిరి పీల్చుకొంటున్న సమయంలో భారత్ ను ఇప్పుడు ‘మర్కజ్‌’ ప్రకంపనలు కుదిపివేస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతం.. దేశంలో కరోనా వ్యాప్తికి తాజా కేంద్రంగా మారింది.

ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మతసంబంధ కార్యక్రమాలలో దేశ, విదేశాల నుండి భారీ సంఖ్యలో పాల్గొనడంతో వారిలో కొందరి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందినదని, వారి ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నదని కధనాలు వెలువడుతున్నాయి. దానితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు కరువవుతుంది.

కాశ్మీర్ నుండి కేరళ వరకు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇక్కడి నుండి తిరిగి వచ్చిన వారిలో పలువురు కరోనా పాజిటివ్ గా తేలడం, కొందరు మృత్యువాత కూడా బడడంతో వారందరిని జల్లెడ వేసి వెతకడం కోసం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు అకస్మాత్తుగా పోస్జిటివ్ కేసులు 48 పెరగడం, వారిలో అత్యధికులు వీరే కావడంతో ప్రభుత్వాలు ఖంగారు పడుతున్నాయి.

తబ్లిగీ జమాత్‌ సంస్థకు చెందిన అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’లో ఈ నెల 1-15 మధ్య మతపరమైన కార్యక్రమం జరిగింది. విదేశీయులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దానితో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. గత నెల రోజుల్లో దాదాపు 8,000 మంది ఈ మర్కజ్‌ను సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు.

ఇలా ఉండగా, ‘తబ్లిగీ జమాత్‌ అనేది ముస్లిం మతవాద ఉద్యమం అని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ తెలిపారు. 1926లో హర్యానాలోని మేవాట్‌లో ఇది ప్రారంభమైంది. 150 దేశాల నుంచి 1.2 కోట్ల నుంచి 8 కోట్ల మంది ముస్లింలు ఈ జమాత్‌కు హాజరవుతుంటారు. ఉజ్బెకిస్థాన్‌, తజికిస్థాన్‌, కజకిస్థాన్‌ దేశాలు దీనిని నిషేధించాయి. ఉగ్రవాదులతో జమాత్‌కు పరోక్ష సంబంధాలున్నాయని పేర్కొన్నారు.

నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గత రెండురోజులుగా ఢిల్లీ పోలీసులు 1,830 మందిని గుర్తించగా, వారిలో 281 మంది విదేశీయులు ఉన్నట్లు తేలింది. లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత కూడా వీరు మర్కజ్‌లోనే ఉన్నారు. విదేశీయుల్లో ఇండోనేషియా (74 మంది), శ్రీలంక (34), మయన్మార్‌ (33), కిర్గిస్థాన్‌ (28), మలేసియా (20), నేపాల్‌ (9), బంగ్లాదేశ్‌ (9), థాయ్‌లాండ్‌ (7), ఫిజి (4), బ్రిటన్‌ (3), ఆఫ్ఘనిస్థాన్‌, అల్జీరియా, జిబౌతి, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

మిగిలిన 1549 మందిలో తమిళనాడు (501), అసోం (216), ఉత్తరప్రదేశ్‌ (156), మహారాష్ట్ర (109), మధ్యప్రదేశ్‌ (107), బీహార్‌ (86), బెంగాల్‌ (73), తెలంగాణ (55), జార్ఖండ్‌ (46), కర్ణాటక (45), ఉత్తరాఖండ్‌ (34), హర్యానా (22), అండమాన్‌ నికోబార్‌ (21), రాజస్థాన్‌(19), హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశా నుంచి 15 చొప్పున, పంజాబ్‌ (9), మేఘాలయకు చెందినవారు ఐదుగురు ఉన్నారు.

ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లివచ్చినవారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. తబ్లిగీ కార్యకలాపాల కోసం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 2,100 మంది విదేశీయులు భారత్‌కు వచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

మార్చి 21 నాటికి 821 మంది దేశంలోని వివిధ మర్కజ్‌లకు తరలివెళ్లగా, 216 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉండిపోయినట్లు తెలిపింది. మిగిలిన వారు లాక్‌డౌన్‌కు ముందే దేశం విడిచి వెళ్లిపోయి ఉండొచ్చని పేర్కొంది. 824 మంది విదేశీయుల వివరాలును ఈ నెల 21న అన్నిరాష్ట్రాల పోలీసులకు పంపామని, వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సిందిగా సూచించామని తెలిపింది.

అలాగే భారత్‌కు చెందిన కార్యకర్తలను గుర్తించాల్సిందిగా ఈ నెల 28న రాష్ట్రాలను కోరామని, ఇప్పటివరకు 2,137 మందిని గుర్తించినట్లు తెలిపింది. తబ్లిగీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చే విదేశీయులకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపు 2100 మంది విదేశీయులు టూరిస్ట్‌ వీసాపై వచ్చి మత కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, మత కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 300 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌ చేర్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు.