Ponguleti Srinivasa Reddy: నో ఆప్షన్ .. కాంగ్రెస్‌లోకి మట్టా’.. ఇక బీజేపీలోకేనా పొంగులేటి?

వాస్తవానికి దయానంద్‌ విజయ్‌కుమార్‌ రాజకీయ జీవితం పొంగులేటితో ప్రారంభమైంది. 2014లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓడిపోయారు.

Written By: Bhaskar, Updated On : May 26, 2023 5:56 pm

Ponguleti Srinivasa Reddy

Follow us on

Ponguleti Srinivasa Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మళ్లీ గెలవనివ్వను, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని శపథం చేసిన మాజీ ఎంపీ పొంగలేటి శ్రీనివాసరెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయన భార్య మట్టా రాగమయిని కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పొంగులేటి శిబిరంలో ఒక్కసారిగా అలజడి మొదలయింది. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనపై విమర్శలు ప్రారంభించారు. పట్టుమని పది రోజులు కూడా తన అనుచరులను తన వెంట ఉంచుకోలేని పొంగులేటి తమని ఎలా ఓడిస్తారని ప్రశ్నిస్తున్నారు.

పొంగులేటికి దూరం

వాస్తవానికి దయానంద్‌ విజయ్‌కుమార్‌ కొద్ది రోజుల నుంచి పొంగులేటికి దూరంగా ఉంటున్నారు. పొంగులేటి బీజేపీలోకి వెళ్తారనే వార్తల వస్తున్న నేపథ్యంలో అప్పటి నుంచే ఆయన దారి ఆయన చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే కొద్ది రోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత గుండె పోటుకు గురికావడంతో ఆసుపత్రిలో చికిత్సి పొందారు. కొద్ది కాలానికి అనుచరులతో మీటింగ్‌ పెట్టి ఏం చేద్దామని అడిగితే అందరూ ముక్తకంఠంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాలని చెప్పారు. దీంతో దయానంద్‌ కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నారు. అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అడపాదడపా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అనుచరులతో మీటింగ్‌ పెట్టే కంటే ముందే రేవంత్‌రెడ్డి నుంచి దయానంద్‌కు ఆహ్వానం అందిందని తెలుస్తోంది. అయితే సీటు విషయంపై గట్టి హామీ ఇవ్వడం, దీనికి రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క ఓకే చెప్పడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు తెలుస్తోంది.

ఆయన దారి ఆయన చూసుకున్నారు

వాస్తవానికి దయానంద్‌ విజయ్‌కుమార్‌ రాజకీయ జీవితం పొంగులేటితో ప్రారంభమైంది. 2014లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా పొంగులేటి వెంట నడిచారు. భారత రాష్ట్ర సమితిలో చేరారు. 2018లో విజయ్‌కుమార్‌ పోటీ చేయకుండా కేటీఆర్‌ నిలువరించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి పోటీ చేశారు. అసమయంలో దయానంద్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో రవి ఓడిపోయారు. సండ్ర గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే మట్టా దయానంద్‌ పొంగులేటితోనే కొనసాగారు. చివరకు అధిష్ఠానానికి వ్యతిరేకంగా పొంగులేటి నిరసన గళం విన్పించినప్పడూ ఆయనతోనే ఉన్నారు. కానీ ఎప్పుడయితే బీజేపీలోకి చేరాతరని సమాచారం ఉందో అప్పుడే ఆయన దారి ఆయన చూసుకున్నారు.

మట్టా దయానంద్ ఆస్తులను రాయించుకున్నారా?

అయితే 2014 ఎన్నికల్లో దయానంద్‌కు పొంగులేటి ఫైనాన్స్‌ చేశారని ఆయన అభిమానులు అంటు ఉంటారు. ఆ సమయంలో ఆయన ఆస్తులను పొంగులేటి రాయించుకున్నారని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అందుకే దయానంద్‌ పొంగులేటి వెంట నడిచారని తెలుస్తోంది. అయితే పొంగులేటి వల్ల తన రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారడంతో దయానంద్‌ తన దారి తాను చూసుకున్నారని తెలుస్తోంది. పైగా సండ్ర కు ధీటైన అభ్యర్థి దయానంద్‌ విజయ్‌కుమార్‌ మాత్రమేనని కాంగ్రెస్‌ కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. 2023లో జరగబోయే ఎన్నికల్లో ఫైనాన్స్‌ చేస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లిపై సంబాని చంద్రశేఖర్‌, మానవతారాయ్‌ వంటి వారు కూడా ఆశలు పెంచుకున్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రపై విశేషంగా ప్రచారం చేస్తున్నారు. మరి దయానంద్‌ రాకపై వీరు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.