ఎంఎస్ ధోని సినిమాతో ఫేమస్ అయిన సుశాంత్ సింగ్.. 2008లో స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమోగింది. ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ తింది. అయితే ఆయన కేసులో అతని ప్రియురాలైన రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్లు తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఇతని అరెస్టుతో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా ఇరకాటంలో పడినట్లైంది. అబ్దుల్ బాసిత్‌తో రియా సోదరుడికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావడంతో.. NCB అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాంద్రాలో ఇతడిని అదుపులోకి తీసుకోగా.. అతనికి సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండాతోనూ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా రియా సోదరుడు షోవిక్ సూచనల మేరకు బాసిత్ నుంచి మిరండా డ్రగ్స్ తీసుకునే వాడని బ్యూరో తెలిపింది.
మిరండా గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా గతేడాది మే నెలలో రియానే నియమించింది. ఇంటికి సంబంధించిన ఖర్చుల వ్యవహారాలన్నీ మిరండానే చూసుకునే వాడు. మిరండా పైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీ కూడా ఆరోపణలు చేసింది. అతను డబ్బులు కొల్లగొట్టేవాడని, డ్రగ్స్ సరఫరా చేసేవాడని విమర్శలు గుప్పించింది.
ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ బాసిత్‌తోపాటు జైద్ విలాత్రాను కూడా NCB అరెస్టు చేసింది. కాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ కేసుతో సంబంధం ఉన్న యాభై మందికి పైగా విచారించారు ముంబై పోలీసులు. రియా చక్రవర్తి కీలకంగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రోజుకో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే రియా తనకేం సంబంధం లేదన్నట్లుగా వాదిస్తోంది. బలమైన ఆధారాలు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా దొరుకుతున్నాయి. మరి ఈ కేసు చివరికి ఎటు మలుపుతుందో చూడాలి.