హుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు దృష్టి సారించాయి. వారి బలాబలాలపై అప్పుడే సర్వేలు మొదలు పెట్టాయి. ప్రజల నాడి తెలుసుకునేందుకు రహస్యంగా సర్వే గ్రూపులు రంగంలోకి దిగుతున్నాయి. అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీపై అప్పుడే సర్వే చేస్తున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే వానిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడాక ఆయన ప్రభావం ఏ మేరకు పెరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మహిళలు, రైతులు, యువత, వృద్ధులు అన్ని వర్గాల ప్రజల నుంచి సమాచారం రాబడుతున్నారు. ప్రతి రోజు అప్ డేట్స్ సర్వే టీమ్స్ ఏజెన్సీలకు పంపిస్తున్నాయి. ఏఏ గ్రామాల్లో ఈటలకు వ్యతిరేకత ఉంది? ఎక్కడ ఆయన ప్రభావం ఎక్కువగా ఉందనే దానిపై తెలుసుకుంటున్నారు.
ఏ గ్రామాల్లో ఈటలకు బలముంది? ఎక్కడ ఆయనకు వ్యతిరేకత ఎక్కువగా ఉందనే దానిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఈటల ఏమేరకు లబ్ధి పొందుతారోనని అంచనా వేస్తున్నారు. రోజులు గడుస్తున్న క్రమంలో ఆయన గ్రాఫ్ తగ్గుతుందా?పెరుగుతుందా అనే దానిపై రిపోర్టులు తయారు చేస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన నిఘా వర్గాలు మాత్రమే సమాచారాన్ని సేకరించేవి. గత రెండు రోజులుగా రాష్ర్టంలోని వివిధ జిల్లాలకు చెందిన బృందాలు కూడా ఇక్కడ మోహరించాయి. టీఆర్ఎస్ లో ఉన్న వైఫల్యాలు ఏంటి? అనే విషయాలపై వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.
గులాబీ పార్టీ చేస్తున్న తప్పిదాలు, ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నాయి. హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరాలనే సంకల్పంతో సర్వే టీం ప్రణాళికలు రచిస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ రాజకీయ నేతలను సమాయత్తం చేస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార పార్టీ తన పంథా మార్చుకుంటోంది.