https://oktelugu.com/

Kolkata Doctor  case: కోల్ కతా వైద్యురాలి హత్యాచారం కేసులో.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ

 కోల్ కతా లోని ఆర్జీ కార్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలు దారుణమైన హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 21, 2024 11:59 am
    Kolkata Doctor Murder Case

    Kolkata Doctor Murder Case

    Follow us on

    Kolkata Doctor  case : కోల్ కతా శిక్షణ వైద్యురాలి హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు పేరు, ఫోటోలు, వీడియోలను అన్ని సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ” లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడం సరికాదు. నిపున్ సక్సేనా కేసులో సుప్రీంకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వాటిని కొంతమంది ఉల్లంఘిస్తున్నారు. బాధితురాలు చనిపోయినప్పటికీ.. ఆమె పేరు ఇలాంటి విషయాలలో బహిర్గతం చేయడం ఏమాత్రం సబబు కాదు. ఇది బాధితురాలి గోప్యతను హరించడమేనని” సుప్రీంకోర్టు పేర్కొన్నది. ” శిక్షణ వైద్యులు అత్యాచారానికి గురి అయిన తర్వాత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్నవారు ఆమె మృతదేహాన్ని ఛాయాచిత్రాలు ప్రదర్శించారు. ఇది సరైన చర్య కాదు. అందువల్లే సుప్రీంకోర్టు నిషేధాజ్ఞను జారీ చేయాల్సి వచ్చింది. ఈ నిబంధనను కచ్చితంగా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ నిర్వాహకులు పాటించాల్సి ఉందని” చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు.

    మరోవైపు శిక్షణ వైద్యురాలి ఛాయచిత్రాలను సామాజిక మాధ్యమాలలో బహిర్గతం చేయడానికి ప్రశ్నిస్తూ న్యాయవాది కిన్నోరి ఘోష్, ఇతర వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం విచారించింది. బాధితురాలి పేరు, సంబంధిత హ్యాష్ ట్యాగ్ లు, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్ సహా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని పిటిషన్ పేర్కొంది. “మృతురాలి ఛాయాచిత్రాలు, వీడియోలు మీడియా మొత్తం ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. ముందు మేము స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నామని” సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిపున్ సక్సేనా కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ” బాధితురాలి పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురించకూడదు, ముద్రించకూడదు. రిమోట్ విధానంలో కూడా వాస్తవాలను బహిర్గతం చేయకూడదు. బాధితురాలికి ప్రజల మద్దతును మాత్రమే తెలియజేయాలి. అంతేతప్ప అత్యుత్సాహంతో ఇష్టానుసారంగా వివరాలను ప్రసారం చేస్తే.. బాధితురాలి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని” నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.. కాగా, ఆగస్టు 9న శిక్షణ వైద్యురాలు మృతదేహం లభ్యమైనది.. మరుసటి రోజు కోల్ కతా పోలీసులు సంజయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని సిబిఐ విచారిస్తోంది. త్వరలోనే అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనుంది.