ఎల్జీ పాలిమర్స్‌కు ఈసారి సుప్రీం లో చుక్కెదురు

విశాఖపట్నంలో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్యాస్ లీక్ జరిగి 12 మంది మరణానికి, వందలాదిమంది తీవ్ర అనారోగ్యాలకు గురికావడానికి కారణమైన దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్‌కు ఈ సారి సుప్రీం కోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది. […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 4:10 pm
Follow us on

విశాఖపట్నంలో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్యాస్ లీక్ జరిగి 12 మంది మరణానికి, వందలాదిమంది తీవ్ర అనారోగ్యాలకు గురికావడానికి కారణమైన దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్‌కు ఈ సారి సుప్రీం కోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది.

ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాంట్‌ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. విచార‌ణ కోసం నియ‌మించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీని పై ఏపీ హైకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దర్యాప్తు చేస్తున్నాయని ఈ సమయంలో తాము విచారణ జరపలేమని స్పష్టం చేసింది. హైకోర్టు, ఎన్జీటీలో విచార‌ణ ముగిసిన త‌ర్వాతే సుప్రీం కు రావాల‌ని స్పష్టం చేసింది.

ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని కంపెనీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

అంతకు ముందు రూ 50 కోట్లు డిపాజిట్ చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశంపై కూడా సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం తెలిసిందే.