
దేశంలోని ప్రజల మధ్య ఎక్కువగా చర్చ జరిగే అంశాల్లో రిజర్వేషన్లు ఒకటి. ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. 2004లో పంజాబ్ హైకోర్టు విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు , ఎస్సీ ఎస్టీల వర్గీకరణ గురించి ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని సుప్రీం నిర్ణయించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదించింది.
రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ, వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు పార్లమెంట్ కు మాత్రమే ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన అధికారం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం లేదని 2005 సంవత్సరంలో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ’ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే రెండూ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాలే కావడంతో బెంచ్ ఇచ్చిన తీర్పు తక్షణం అమలు కాదని తెలుస్తోంది.
ఐదు మందే సభ్యులు ఉన్న ధర్మాసనానికి తీర్పును సమీక్షించే అధికారం లేనందు వల్ల దాన్ని ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులు ఉన్న ధర్మాసానానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి బోబ్డేను కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ” ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమానతలు ఉన్నాయని… అట్టడుగు వారికి రిజర్వేషన్ ఫలాలు చేరడం లేదని… వేర్వేరు వర్గాల మధ్య తేడాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను తీసేయకూడదు” అని పేర్కొంది.
షెడ్యూల్డ్ కులాల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని… ఆర్టికల్ 341(2)లో ఉన్న అన్ని ఎస్సీ కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుందని… కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కొన్ని కులాలను విస్మరిస్తే జీవితాంతం ఆ కులాలు వెనుకబాటుతనంతోనే మిగిలిపోతాయని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం మిగిలిన కులాలకు నష్టం జరగకుండా నిమ్నవర్గాల్లో అతి వెనుకబడ్డ కులాలను రిజర్వేషన్లను కల్పించిందని… ఇది సరైన నిర్ణయమేనని అరుణ్ మిశ్రా ధర్మాసనం అభిప్రాయపడింది.