Supreme Court On Jallikattu: జల్లికట్టు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టును ఆటను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎద్దులను లొంగతీసుకొని, మచ్చిక చేసుకునే ఒక ఆట. ఎద్దులను పొరపాటున కూడా హాని కలించరు. ఆయుధాలను ఉపయోగించరు.

Written By: SHAIK SADIQ, Updated On : May 18, 2023 1:50 pm

Supreme Court On Jallikattu

Follow us on

Supreme Court On Jallikattu: అనాదిగా వస్తున్న సంప్రదాయ ఆటలకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పండుగల సందర్భంగా నిర్వహించే జల్లికట్టు, కంబల, ఎడ్ల బళ్ల ఆటలను నిర్వహించుకోవచ్చని తీర్పు చెప్పింది. జంతువులను హింసపెడుతున్నారని దాఖలైన పిటీషన్లను కొట్టివేసి షాక్ ఇచ్చింది. తాజాగా సుప్రీం ఇచ్చి తీర్పుతో జల్లికట్టు, కంబల, ఎడ్ల బళ్ల ఆటలను ఇష్టపడేవారు ఎగిరి గంతులెస్తున్నారు.

పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టును ఆటను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎద్దులను లొంగతీసుకొని, మచ్చిక చేసుకునే ఒక ఆట. ఎద్దులను పొరపాటున కూడా హాని కలించరు. ఆయుధాలను ఉపయోగించరు. మచ్చిక చేసుకోవడమే ఆట ప్రధాన ఉద్దేశ్యం. ఎద్దులను తరుముతూ ఒక్కసారిగా తమపైకి వచ్చే వాటిని నియంత్రిస్తుంటారు. తమిళ పురాణాల ప్రకారం జల్లికట్టులో విజేతలైన వారిని మహిళలు భర్తలుగా ఎంపిక చేసుకుంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎడ్లబళ్ల పోటీలు ఇదే తరహాలో నిర్వహిస్తుంటారు.

ఈ ఆటపై పలువురు జంతు ప్రేమికులు కోర్టుకెక్కారు. ఆటను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని తమిళనాడు ప్రభుత్వం 2017లో చట్టం తీసుకువచ్చింది. ఈ ఆటలో క్రూరత్వం లేదని సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. పెరూ, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలు ఎద్దుల పందాలను సాంస్కృతిక వారసత్వంలో భాగంగా పరిగణిస్తున్నాయని వాదించింది. కేవలం వినోదం పరంగానే కాకుండా గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన విలువ కలిగిన కార్యక్రమంలో భాగంగా జల్లికట్టును నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.

దీనిని సమర్థించిన సుప్రీం కోర్టు జంతు హింస జల్లికట్టుకు వర్తించదని పేర్కొంది. అది తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తాము కాదని పేర్కొంది. 2014లో హై కోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. సాంస్కృతిక వారసత్వానికి జల్లికట్టు చిహ్నమని.. వారసత్వ పరిరక్షణకు చట్టాలు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో ఎలాంటి లోపం లేదని తెలిపింది.

తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎడ్లబళ్ల పోటీల నిర్వహణకు అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి ఈ రాష్ట్రాలు సవరణలు చేయడాన్ని సమర్థించింది. సాంస్కృతిక వారసత్వంపై తగిన నిర్ణయం తీసుకోవడంలో చట్టసభలదే తుది నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని తెలిపింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ రాష్ట్రాలు చేసిన సవరణలు సరైనవేనని చెప్పింది. ఈ సవరణలను ‘కలరబుల్ లెజిస్లేషన్స్’ అని చెప్పలేమని తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు, రెండో జాబితాలోని 17వ ఎంట్రీ ప్రకారం ఈ సవరణలను చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవి కుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.