ఎంపీ ఎమ్మెల్యేల నిర్బంధంపై సుప్రీం అభ్యంతరం

మధ్య ప్రదేశ్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించిన్నట్లు వస్తున్న కధనాల పట్ల సుప్రీం కోర్ట్ అభ్యంతరం తెలిపింది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరుకావచ్చునని, అయితే వారిని నిర్బంధించరాదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ప్రస్తుతం 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఏదో వైపు మొగ్గు చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. కాగా ఎవరికి మద్దతు ఉందో నిర్ణయించేందుకు శాసన సభ కార్యకలాపాల్లోకి తాము రాబోవడం లేదని స్పష్టం చేసింది. మధ్య ప్రదేశ్ […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 5:54 pm
Follow us on

మధ్య ప్రదేశ్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించిన్నట్లు వస్తున్న కధనాల పట్ల సుప్రీం కోర్ట్ అభ్యంతరం తెలిపింది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరుకావచ్చునని, అయితే వారిని నిర్బంధించరాదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

ప్రస్తుతం 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఏదో వైపు మొగ్గు చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. కాగా ఎవరికి మద్దతు ఉందో నిర్ణయించేందుకు శాసన సభ కార్యకలాపాల్లోకి తాము రాబోవడం లేదని స్పష్టం చేసింది.

మధ్య ప్రదేశ్ శాసన సభలో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తా డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

తాము శాసన సభ దారిలోకి రాబోవడం లేదని దర్మాసనం తెలిపింది. సభలోకి రావడం, విప్‌‌లకు అనుగుణంగా నడచుకోవడం వంటివి ఎమ్మెల్యేల ఇష్టమని తెలిపింది. అయితే కచ్చితంగా, వారు నిర్బంధంలో ఉన్నట్లు ఆరోపణ వచ్చినపుడు, వారు స్వేచ్ఛా సమ్మతితోనే ఉండేలా చూడవలసి ఉంటుందని చెప్పింది.

బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడారని, తాము స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారని, వారి రాజీనామాలపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని వాదించారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలను న్యాయమూర్తుల ఛాంబర్‌లో హాజరుపరుస్తామని చెప్పారు.

అయితే ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. రోహత్గి మాట్లాడుతూ ఇందుకు ప్రత్యామ్నాయంగా కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ స్వయంగా గురువారం వెళ్ళి, రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకోవచ్చునని, అన్ని వివరాలను వీడియో రికార్డు చేయవచ్చునని అన్నారు.

ఇదిలావుండగా, స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు ఓ లేఖ రాశారు. అదృశ్యమైన ఎమ్మెల్యేల రాజీనామాలు తన పరిశీలనలో ఉన్నాయని, వారు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎమ్మెల్యేలు తమ స్వంత నిర్ణయంతోనే రాజీనామా చేశారా? అనే సందేహాలు కలుగుతున్నాయని ప్రజాపతి ఆ లేఖలో అనుమానం వ్యక్తం చేశారు.