Supreme Court CJI : భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. జస్టిస్ గవాయి మే 14, 2025న అధికారికంగా CJI బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఆరు నెలల పాటు ఈ పదవిలో కొనసాగి, నవంబర్ 2025లో పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2007–2010) తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి చరిత్రలో నిలిచారు.
Also Read : 2025లో భారత రాష్ట్రాల పనితీరు.. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఆధిపత్యం
న్యాయ రంగంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం
మహారాష్ట్రలోని అమరావతిలో 1960లో జన్మించిన జస్టిస్ గవాయి, 1985లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మాజీ మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలే వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఆయన, 1987 నుంచి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన ఆయన, 2000లో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన న్యాయ రంగంలో సుదీర్ఘ అనుభవం, నిష్పక్షపాత వైఖరి ఆయనను ఉన్నత స్థాయికి చేర్చాయి.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు..
జస్టిస్ గవాయి 2003లో మహారాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాగ్‌పూర్ బెంచ్‌లో ఆయన నిర్వర్తించిన వివిధ కేసుల్లో నిష్పక్షపాత తీర్పులు, న్యాయస్థాన ప్రక్రియల్లో సంస్కరణలకు చేసిన కృషి ఆయనను గుర్తింపు తెచ్చాయి. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, రాజ్యాంగ విషయాలు, క్రిమినల్ కేసులు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల్లో ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు. ఆయన న్యాయ దృక్పథం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణపై దృష్టి ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి.
దళిత న్యాయమూర్తిగా చరిత్రలో స్థానం
జస్టిస్ గవాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడం దళిత సమాజానికి గర్వకారణంగా నిలిచింది. 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ CJIగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత, ఈ ఉన్నత పదవిని అలంకరించిన రెండో దళిత న్యాయమూర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ నియామకం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని భారత న్యాయ వ్యవస్థలో పెంపొందించడంలో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ నియామకాన్ని స్వాగతిస్తూ, జస్టిస్ గవాయి నాయకత్వంలో న్యాయస్థానం మరింత సంస్కరణలు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సవాళ్లు, అవకాశాలు..
జస్టిస్ గవాయి ఆరు నెలల స్వల్పకాలిక ఇఒఐ పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, రాజ్యాంగ సంస్థల మధ్య సమన్వయం, సామాజిక న్యాయానికి సంబంధించిన కీలక కేసుల్లో తీర్పులు ఇవ్వడం వంటి అంశాలు ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు. అదనంగా, డిజిటలైజేషన్, కోర్టు ప్రక్రియల సరళీకరణ, న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని పెంపొందించడం వంటి సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. న్యాయవాదులు, విశ్లేషకులు ఆయన నాయకత్వంలో సుప్రీంకోర్టు మరింత పారదర్శకంగా, ప్రజాముఖంగా మారుతుందని ఆశిస్తున్నారు.