https://oktelugu.com/

సునీల్‌ మరణం.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం

ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగు మందు తాగిన విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌(25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు తేజవత్‌రాంసింగ్‌ తండాకు చెందిన సునీల్‌ హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. గతంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టుదలతో హన్మకొండలో కోచింగ్‌ తీసుకున్నాడు. కేయూ క్యాంపస్‌ లైబ్రరీలో చదువుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఉద్యోగ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2021 10:55 am
    Follow us on

    Sunil
    ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగు మందు తాగిన విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌(25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు తేజవత్‌రాంసింగ్‌ తండాకు చెందిన సునీల్‌ హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. గతంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టుదలతో హన్మకొండలో కోచింగ్‌ తీసుకున్నాడు. కేయూ క్యాంపస్‌ లైబ్రరీలో చదువుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఇప్పట్లో నోటిఫికేషన్లు రావని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అగచాట్లు పడుతున్నారని ఆవేదన చెందాడు. మార్చి 26న తను రోజూ చదువుకునే కేయూ లైబ్రరీ సమీపంలోని క్రీడా మైదానంలో పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి ఐదు రోజులపాటు చికిత్స పొందిన సునీల్‌.. శుక్రవారం మరణించాడు.

    ఇప్పుడు సునీల్‌ మరణం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇన్నాళ్లు రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ నేతలు.. సహా విపక్ష నేతలందరూ ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించాయి. బోడ సునీల్‌ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్య అంటూ విరుచుకుపడ్డారు. బోడ సునీల్ సూసైడ్ నోట్ కూడా రాశారు. అందులో ప్రభుత్వం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నేరుగానే చెప్పారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలనే డిమాండ్లను విపక్షాలు వినిపిస్తున్నాయి.

    కేసీఆర్‌పై కేసు పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజకీయాల కోసం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో యాభై శాతం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదు.. కేసీఆర్ చేసిన హత్య అని బండి సంజయ్ మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. సునీల్ నాయక్‌కు నివాళిగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిందీ స్టూడెంట్లే. ఉద్యమంలో వారి పాత్రను ఎవరూ తీసిపారేయలేరు. ఎక్కడికక్కడ యువత ప్రాణాలు అర్పించడంతోనే ఉద్యమం ఎగసిపడింది. ఇప్పుడు అదే తరహాలో ఉద్యోగాల భర్తీ కోసం సునీల్ ఆత్మార్పణం నిప్పు రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు యాభై వేల ఖాళీల భర్తీ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు. త్వరలో భర్తీ.. త్వరలోనే భర్తీ అనే ప్రకటనలు తప్ప నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు. ఈ క్రమంలో బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ ఎజెండాను మార్చే అవకాశం కనిపిస్తోంది.