
Madhya Pradesh: ప్రపంచంలో ఎన్నో రకాల జాతరలు చూస్తుంటాం. కానీ గాడిదల జాతర అనేది కూడా ఉంటుందని తెలుసా? గాడిదలతో జాతర చేయడం ఓ వింతే. మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని సత్నా జిల్లాలోని చిత్రకూట్ లో ఈ జాతర నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గాడిదలను ఇక్కడికి తీసుకొస్తుంటారు. గాడిదలను వేలం వేస్తుంటారు. వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దీంతో ఈ జాతరకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
గాడిదలతో జాతర నిర్వహించడం ఓ అరుదైన ఆలోచనే. ఎక్కడ చూడని విధంగా ఇక్కడ గాడిదలను ఒక చోట చేర్చి వాటిని కొనుగోలు, అమ్మకాలు చేయడం సాహసమే. దీని కోసం అక్కడ నిర్వాహకులు చాలా మంది కూడా వేచి ఉంటారు. జాతర నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపారులకు అన్ని విధాలుగా సహకరిస్తారు.
దీపావళి రెండో రోజు నుంచి పవిత్ర మందాకిని నది ఒడ్డున నిర్వహించే ఈ జాతరకు సుమారు 15 వేల గాడిదలు వచ్చాయి. ఒక్కో గాడిద ధర రూ. 10 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పలకడం గమనార్హం. గాడిదల రూపాన్ని బట్టి ధరలో కూడా మార్పులుంటున్నాయి. రెండు రోజుల్లో తొమ్మిదివేల గాడిదలను వ్యాపారులు కొనుగోలు చేశారు. జాతరలో దాదాపు రూ.20 కోట్ల వ్యాపారం కొనసాగినట్లు తెలుస్తోంది.
ఈ జారతపై ఓ చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దీన్ని ప్రారంభించారని చెబుతారు. మొఘల్ సైన్యానికి ఆయుధాలు, లాజిస్టిక్స్ కొరత ఉన్న చోట గాడిదలను కొనుగోలు చేయాలని భావించి ఆ ప్రాంతంలో వీటిని కొనుగోలు చేయాలని జాతర నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా దీపావళి వెళ్లిన రెండు రోజులకు గాడిదల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మందాకిని నది ఒడ్డున ఉన్న మైదానంలో చిత్రకూట్ నగర పంచాయతీ ఆధ్వర్యంలో గాడిదల జాతర నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుత పరిస్థితుల్లో గాడిదలు తక్కువ స్థాయిలో వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ధరల్లో కూడా మార్పులు వస్తున్నాయని తెలుస్తోంది. కరోనా మొదలయ్యాక చాలా వ్యాపారాలు వెనుకబడి పోయినట్లు తెలుస్తోంది కదా దీనిపై కూడా దాని ప్రభావం పడుతోంది.
గాడిదల జాతరలో గతంలో జరిగిన వ్యాపార లావాదేవీలు ప్రస్తుతం కొనసాగడం లేదు. వ్యాపారాలు డీలా పడ్డాయి. దీంతో వ్యాపారులు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నారు. పూర్వం వచ్చిన లాభాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో జాతర నిర్వహణపై పలువురు వ్యాపారులు నైరాశ్యంలో పడిపోతున్నారు. మొత్తానికి ప్రపంచంలోనే గాడిదల కోసం నిర్వహించే జాతర ఉందని తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతున్నారు.