
MLC Kavitha : కవిత.. ఈ పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం కారణంగా ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల వారసురాలు, ఎమ్మెల్సీ కవితకు కాలుకు రెండు రోజుల క్రితం గాయమైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మూడు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించారు. దీంతో ఆమె అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు కవిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కవిత కాలికి గాయంపై విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెకు ఈడీ నుంచి మళ్లీ పిలుపు రాబోతోందా..? అందుకే కవిత తన కాలుకు గాయం అయినట్లు పేర్కొన్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కవిత తన కాలికి గాయమైనట్లు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కల్వకుంట్ల కవితపై బాంబు పేల్చాడు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్స్ బయట పెట్టాడు. దీంతో కవిత కాలికి గాయంపై విపక్ష నేతల అనుమానం నిజమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-కవితతో చాట్స్ లీక్..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఆప్ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ప్రేమ లేఖ రాస్తూ కాలక్షేపం చేస్తున్న ఈ మోసగాడు తాజాగా మరో బాంబు పేల్చాడు. బీఆర్‌ఎస్, ఆప్ నేతలతో చాటింగ్ చేసిన మేసేజ్‌లను బయటపెట్టాడు. అందులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో జరిగిన చాటింగ్ వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుఖేష్ తరుఫు లాయర్ బయటపెట్టారు. అందులో కోడ్ లాంగ్వేజ్‌తోపాటు కొన్ని తెలుగు పదాలున్నాయి.
-అక్క.. అంటు చాటింగ్..
సుఖేష్ చాట్స్‌లో కవితను పలుమార్లు అక్క అంటూ పదేపదే సంబోధించాడు. డబ్బులు డెలివరీ చేసినట్లు కవితకు చేసిన చాట్స్‌లో ఉండటం గమనార్హం. స్పోకెన్ టు మనీష్ అని రిప్లయ్‌లో ఉంది. అరవింద్ కేజ్రీవాల్, సుఖేష్ జైన్‌కు ఇన్ఫామ్ చేయాలని సుఖేష్ కోరాడు. వీరి పేర్లు పూర్తిగా కాకుండా ఏకే, ఎస్‌జేగా సంబోధించాడు. సత్యేంద్ర జైన్‌తోనూ చాట్ చేసిన స్క్రీన్ షాట్లను వెలుగులోకి వచ్చాయి. అందులో 15 కేజీల నెయ్యి రెడీ అంటూ మేసేజ్ చేసిన సుఖేష్. హైదరాబాద్ లో సిస్టర్‌కు పంపాలని సుఖేష్‌కు రిప్లయ్ అందింది.
-గాయానికి కారణం చాట్సేనా..?
ఇక సుశేష్ వాట్సాప్ చాట్స్ లీక్‌కు ఒక రోజు ముందు కల్వకుంట్ల కవిత కాలుకు గాయం కావడం ఇప్పుడ చర్చనీయాంశమైంది. ఆ గాయం సుఖేష్ చేసిందేనా అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా కవిత తనకు ఏమైనా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ ఈసారి తన కాలికి గాయమైందని ట్వీట్ చేశారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సుఖేష్ లీక్స్ సంచలనంగా మారాయి. సుఖేష్ చంద్రశేఖర్ గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 నంబర్ కారులో ముట్టజెప్పినట్టు తెలిపారు. అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు. తాజాగా కల్వకుంట్ల కవిత చాట్స్ బయట పెట్టాడు. దీనిపై బీఆర్‌ఎస్‌గానీ, కల్వకుంట్ల కవితగానీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.