
నిన్నామొన్నటి వరకు హుజూరాబాద్ కేంద్రంగా కొనసాగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ప్రజాదీవెన యాత్ర పేరుతో ఈటల రాజేందర్ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగారు. అటు కేసీఆర్ అంతకు మించి అన్నట్టుగా దళిత బంధును ప్రకటించి పొలిటికల్ కాక రేపారు. అదే హోరులో సాగర్, హాలియా అంటూ పర్యటనలు సాగించారు. నేతలు పోటాపోటీగా పొలిటికల్ స్పీచులు దంచికొట్టారు. మొత్తంగా.. మీడియాలో హుజూరాబాద్ మోతెక్కిపోయింది. అయితే.. ఉన్నట్టుండి అంతా సైలెంట్ అయిపోయారు. దీంతో.. కారణం ఏంటనే చర్చ మొదలైంది.
త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగుతుందని భావించిన పార్టీలు.. హుజూరాబాద్ మీదనే దృష్టి కేంద్రీకరించి పనిచేశాయి. రోజుకు ఎవరో ఒకరు తమ ప్రసంగాల్లో హుజూరాబాద్ అంశాన్ని లేవనెత్తేవారు. అయితే.. ఇప్పుడు చప్పున చల్లారిపోయారు. దీనంతటికీ కారణం కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖేనని అంటున్నారు. సీఈసీ రాసిన లేఖద్వారానే పార్టీలు దుకాణం సర్దేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు ఎన్నిక నిర్వహణ కూడా ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కోర్టులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి.. ఎన్నికల కమిషన్ పై హత్య కేసు నమోదు చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. దీంతో.. ఎన్నికల సంఘం ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి తన మీదకు నింద రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది.
మీ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? లేవా? తెలపాలంటూ లేఖలు రాసింది.ఈ నెల 30వ తేదీ లోగా దీనిపై సమాధానం చెప్పాలని కోరింది. అంటే.. ఈ నెల 30 వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాదని తేలిపోయింది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన సమాధానాన్ని క్రోడీకరించి, ఎన్నికలు నిర్వహించాలా వద్దా? అని ఈసీ సమావేశం కావాల్సి ఉంది. ఒకవేళ ఎన్నిక నిర్వహించాలని భావిస్తే.. ఆ తర్వాత షెడ్యూల్ ప్రిపేర్ చేసి, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టేలా ఉందని పార్టీలకు అర్థమైపోయింది. అందుకే.. అప్పటి వరకూ మొత్తుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయాయని అంటున్నారు. అంతేకాదు.. అప్పటి దాకా ప్రచారం కొనసాగిస్తే.. జేబు ఖాళీ కూడా అయిపోతుంది. అందువల్లే.. మళ్లీ వేడి మొదలయ్యాక రంగంలోకి దిగుదామని సైలెంట్ అయిపోయాయని అంటున్నారు.