Subhash Chandra Bose: నేతాజీ సుభాష్ చంద్రబోస్.. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ పేరు ప్రత్యేకమైనది. అహింసా విధానంలోనే స్వాతంత్రం సాధించవచ్చు అని గాంధీ మహాత్ముడు చెబితే.. హింసాయుత మార్గంలోనే ఆంగ్లేయులను తరిమికొట్టి.. స్వాతంత్ర్యాన్ని పొందచ్చని నిరూపించినవాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మరణం నేటికి రహస్యంగానే కొనసాగుతోంది. 1897 జనవరి 23న కటక్ లో జానకి నాథ బోస్, ప్రభావతి దేవి దంపతులకు సుభాష్ చంద్రబోస్ జన్మించాడు. 1945 ఆగస్టు 18న తైవాన్ లో మరణించినట్టు భావిస్తున్నారు. అయితే ఇప్పటికి ఇది ఒక రహస్యంగానే ఉంది.. ఇతడికి నేతాజీ అనే బిరుదు ఉంది. నేడు సుభాష్ చంద్రబోస్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన రహస్య ప్రేమ గురించి.. ప్రపంచానికి తెలియని ఆయన భార్య గురించి.. ప్రత్యేక కథనం.
గాంధీ మహాత్ముడు అహింసాయుత మార్గం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని భావిస్తే… ఆంగ్లేయులను తన్ని తరిమేసిన నాడే దేశానికి స్వాతంత్రం వస్తుందని బోస్ నమ్మేవాడు. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. ఆజాద్ హింద్ సంస్థను నెలకొల్పి యువకుల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించాడు. భారత జాతికి సర్వసత్తాకమైన సైన్యం ఉండాలని మొదటి నుంచి కోరినవాడు బోస్. దేశ స్వాతంత్ర్య పోరాటంలో దాదాపు 11 సార్లు ఆంగ్లేయుల చేతిలో సుభాష్ చంద్రబోస్ అరెస్టుకు గురయ్యాడు. జైళ్లల్లో తీవ్రమైన శిక్షను అనుభవించాడు. ఆయనప్పటికీ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి వెనకడుగు వేయలేదు. 1945 ఆగస్టు 18న విమానంలో టోక్యో మీదుగా వెళ్తుండగా.. విమానం కూలి తైవాన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని వికీపీడియా ద్వారా తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమంలో రహస్య దళాలను ఏర్పాటు చేసుకున్న బోస్.. చివరికి తన ప్రేమ విషయంలోనూ అంతే రహస్యాన్ని కొనసాగించాడు.
1934లో సుభాష్ చంద్రబోస్ యూరప్ లో ఉన్నాడు. ఆ సమయంలో ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రాసేందుకు ఆయన సంకల్పించారు. దానికోసం ఇంగ్లీష్ బాగా తెలిసిన ఎమిలీ షెంకెల్ అనే యువతని తన సహాయకురాలిగా నియమించుకున్నాడు. ఆమెది ఆస్ట్రియా దేశం. క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. అయితే ఆమె ద్వారా తాను ప్రేమలో పడతానని సుభాష్ చంద్రబోస్ ఊహించలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని చంద్రబోస్ ముందుగా ఆమెకు చెప్పాలని భావించాడు. ఇదే విషయాన్ని సుభాష్ చంద్రబోస్ సోదరుడి మనవడు సుగత్ బోస్ ఒక పుస్తకంలో రాశాడు.
ఎమిలీ చంద్రబోస్ వద్ద పనిచేయడం ఆమె తల్లిదండ్రులకు సుతారం ఇష్టం లేదు. చంద్రబోస్ ను వారు ఒకసారి కలిశారు. ఆయన భావాలు అర్థం చేసుకున్న తర్వాత తమ మనసును మార్చుకున్నారు..ఎమిలీ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో సుభాష్ చంద్రబోస్ తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. ఎమిలీ – సుభాష్ చంద్రబోస్ 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో పెళ్లి చేసుకున్నారు. వీరికి అనిత బోస్ ఫాఫ్ అనే ఒక కూతురు ఉంది.. స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో.. దేశ మహిళను పెళ్లి చేసుకున్నారనే అపవాదు రాకుండా ఉండేందుకు.. చివరి వరకు చంద్రబోస్ తన వివాహాన్ని రహస్యంగా ఉంచారు. ఆయన మరణించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది..