
దుర్గమ్మ భక్తులకు ప్రసాదాలు కూడా అందకుండా చేస్తున్నారా.. అంటే అవుననే సమాధానమొస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, దుర్గమ్మను దర్శించుకునే భక్తులు, ఆలయంలో విక్రయించే ప్రసాదాలను కొనుక్కుని భక్తితో ఆరగిస్తారు. తమ బంధుమిత్రుల కోసం కూడా తీసుకెళతారు. దుర్గగుడి అధికారులు ఇక్కడ కూడా కక్కుర్తి ప్రదర్శిస్తూ, భక్తులకు పరీక్ష పెడుతున్నారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాలను తాజాగా తయారు చేయించి అందించాల్సిన ఆలయాధికారులు 15 రోజులుగా నిల్వ ఉన్న లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు బలవంతంగా అంటగడుతున్నారు. ఆ నిల్వ లడ్డూలను అమ్మేసి సొమ్ము చేసుకోవడం కోసం పది రోజులుగా దేవస్థానంలో పులిహోర ప్రసాదం తయారీని కూడా నిలిపివేశారు.
Also Read: ‘శ్రీలక్ష్మి’ని అక్కున్న చేర్చుకున్న జగన్ సర్కార్!
ఏ దేవాలయంలోనైనా ఏ రోజుకారోజే తయారు చేసిన తాజా ప్రసాదాలను భక్తులకు విక్రయిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానంలో మాత్రం 15 రోజులుగా నిల్వ ఉన్న లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు విక్రయిస్తున్నారు. ఈ లడ్డూ ప్రసాదం బాగాలేదని.. పులిహోర ప్రసాదం కొనుక్కుందామంటే.. అది అసలు అందుబాటులోనే లేదు. నిల్వ ఉన్న లడ్డూ ప్రసాదం అమ్ముడుపోయే వరకు పులిహోర ప్రసాదం విక్రయించడానికి వీల్లేదంటూ దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. దీంతో నిల్వ లడ్డూలను సొమ్ము చేసుకోవడం కోసం పది రోజులుగా దేవస్థానంలో పులిహోర ప్రసాదం తయారీని కూడా నిలిపివేశారు. లాభాలు రావడం లేదంటూ అమ్మవారి చక్రపొంగలి, పంచగద్యం ప్రసాదాల విక్రయాలను ఏడాదిన్నర క్రితమే నిలిపివేశారు.
ఇంద్రకీలాద్రిపై ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ ఉత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలకు లోబడి రోజుకు 10 వేల మందిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ముందునుంచే ప్రచారం చేశారు. అయితే దీక్ష విరమణకు వచ్చే భక్తులు ఎక్కువ ప్రసాదాలను కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో దుర్గగుడి అధికారులు ముందుగానే ఎనిమిది లక్షల లడ్డూలను తయారు చేయించి సిద్ధంగా ఉంచారు. ఈ లడ్డూలను విక్రయించడం కోసం పులిహోర ప్రసాదాల తయారీని పూర్తిగా నిలిపివేశారు. తీరా చూస్తే ఆ ఉత్సవాల ఐదు రోజుల్లో మొత్తం 50 వేల మంది భక్తులు కూడా రాలేదు.
Also Read: చరిత్రను మరిచి చిన్న జీయర్ వ్యాఖ్యలు
దీంతో దేవస్థానం అధికారుల అంచనాల ప్రకారం లడ్డూ ప్రసాదాల విక్రయాలు సాగలేదు. ఉత్సవాల ఐదు రోజుల్లో 5 లక్షల లడ్డూలను కూడా భక్తులు కొనుగోలు చేయలేదు. దీంతో మూడు లక్షలకు పైగా లడ్డూలు మిగిలిపోయాయి. ఆ లడ్డూలు పాడైపోకముందే వీలైనంత త్వరగా విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఆలయాధికారులు నిర్ణయించారు. నిల్వ ఉన్న లడ్డూ ప్రసాదం అమ్ముడుపోయే వరకు ఇతర ప్రసాదాలు తయారు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 5వ తేదీ ముందునుంచే దుర్గగుడిలో ప్రసాదాల తయారీని పూర్తిగా నిలిపివేసి.. నిల్వ ఉండిపోయిన లడ్డూలనే భక్తులకు విక్రయిస్తూ వస్తున్నారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత ఐదారు రోజుల వరకు లడ్డూ ప్రసాదం బాగానే ఉన్నా.. ఆ తర్వాత తేడా వచ్చాయి. దీంతో భక్తులు ప్రసాదం బాగా లేదంటూ కౌంటర్లలో ఉన్న సిబ్బందిని నిలదీస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్