తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భగా అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి బస్సుల ద్వారా జనాన్ని తరలించి, దొంగ ఓట్లు వేయించారని ఆరోపించాయి. అంతేకాదు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అనే చర్చ సాగుతోంది.
నకిలీ ఓటరు ఐడీ కార్డులను ముద్రించి మరీ.. దొంగ ఓట్లు వేయించడానికి జనాన్ని తీసుకొచ్చారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇలా ముద్రించిన ఓటరు కార్డుల సంఖ్య వేలల్లో ఉందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. దొరికిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోగా.. వదిలేశారని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. వ్యవస్థలు కూడా ఈ అక్రమానికి మద్దతు తెలిపాయని అర్థమవుతోందని అంటున్నారు.
కాగా.. ఈ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఇచ్చే నివేదికను బట్టే రీ-పోలింగ్ పై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో.. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందోనని ఎదురు చూస్తున్నాయి విపక్షాలు.
అయితే.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో తిరుపతిలో మాత్రమే దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చాయి. కాబట్టి.. ఈ నియోజకవర్గంలోనే రీ-పోలింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
కాగా.. రీ-పోలింగ్ జరగకుండా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీ-పోలింగ్ కు ఆదేశిస్తే.. ఈసీ తనను తానే అవమానించుకున్నట్టు అని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు విపక్ష నేతలు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుము కోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై జనాలకు నమ్మకం పోకుండా ఉండాలంటే.. రీ-పోలింగ్ జరపాలని కోరుతున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.