కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు సెస్సు రూపంలో పన్నులు విధిస్తుంటుంది. ఇప్పుడు ఆ సెస్సు విధానం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సెస్ వసూలు చేసి.. అందులో రాష్ట్రాలకు వాటా పంచాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఆ రాష్ట్రానికి ఈ నిధి నుంచి పంచి ఇవ్వాలి. మినహాయింపు ఏమిటంటే.. సెస్సుల ద్వారా కేంద్రానికి సమకూరే పన్ను ఆదాయాన్ని ఈ నిధిలో కలపరు. రాజ్యాంగంలోని 270 అధికారణ ప్రకారం సెస్సు ఆదాయం పూర్తిగా కేంద్ర భోజ్యం. దీనికారణంగా సెస్సు వసూళ్లలో రాష్ట్రాలకు వాటా ఉండదు.
Also Read: భార్య, పిల్లలే కాదు.. తల్లిదండ్రులూ వాటాదారులే.. కోర్టు సంచలన తీర్పు
కొన్ని ప్రత్యేక అవసరాలు, కార్యక్రమాల పేరిట సెస్సును విధిస్తారు. వివిధ రకాల సెస్సుల రూపంలో అదనపు ఆదాయం సంపాదించడం.. కేంద్రానికి ఈ మధ్యకాలంలో మామూలు అయింది. పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌చార్జీల వాటా గణనీయంగా పెరుగుతోంది. దీంతో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ (జీటీఆర్)లో తమ భాగం తరిగిపోతోందని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్నాయి. ఆరోగ్యం, విద్య, రహదారులు వంటి నిర్దేశిత ప్రజాప్రయోజనాల కోసం వీటిని వెచ్చించడం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
జీఎస్టీ అమలుతో 17 రకాల సెస్సులు, ఇతర లెవీలు కనుమరుగైనా.. మరో 35 లెవీలు ఇంకా కొనసాగుతున్నాయని కాగ్ చెప్తోంది. ఇలాంటి లెవీల ద్వారా 2018–19లో బారీ మొత్తంలో రూ.2.7 లక్షల కోట్ల రాబడి పోగుకాగా.. నిర్దేశిత ప్రయోజనాలకు ఉద్దేశించిన రిజర్వు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయిన సొమ్ము కేవలం రూ.1.64 లక్షల కోట్లేనని కాగ్ గుర్తించింది. మిగిలిన 40 శాతం నిధులను భారత ప్రభుత్వ సంచిత నిధికి జమ చేశారు.
ముడిచమురు మీద విధించిన సెస్సు ద్వారా రూ.1.25 లక్షల కోట్లు వసూలు చేసినా.. ఒక్క పైసా కూడా చమురు పరిశ్రమ పరిశోధన అభివృద్ధి సంస్థలకు బదిలీ చేయలేదు. ఆరోగ్యం, విద్య పేరిట ఆదాయం పన్నులపై 5 శాతం సెస్సు విధించి సమీకరించిన నిధులను విద్య కోసం పాక్షికంగా కేటాయించినా.. ఆరోగ్యం కోసం చిల్లిగవ్వ ఇవ్వలేదు. సామాజిక సంక్షేమ పేరిట వాణిజ్య సుంకాలపై విధించిన సర్‌చార్జి సొమ్ముదీ ఇదే పరిస్థితి.
ఇదిలా ఉండగా.. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సెస్సుల దారిలో ఆదాయం పెంచుకుంటోందనే వాదన ఉంది. పన్ను రాబడుల విభాజ్య నిధిలో వాటా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అయినా కేంద్ర పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు దక్కింది మాత్రం 35.7 శాతమే. 2016–17 నుంచి పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌చార్జీల వాటా పెరగడమే ఇందుకు కారణం. 2013–14లో కేవలం ఆరు శాతం ఉన్న వీటి వాటా 2019–20 నాటికి 13 శాతానికి చేరింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయం నష్టపోయాయి. దీంతో దానిని భర్తీ చేయడానికి వసూలు చేసిన జీఎస్టీ సెస్సును ఇందులో కలపకుండా సెస్సుల రూపంలో ఇంతటి అదనపు రాబడి నమోదైంది.
Also Read: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు
జీఎస్టీ సెస్సును సైతం కలిపి లెక్కకడితే కేంద్ర పన్నుల ఆదాయంలో సెస్సులు, సర్‌చార్జీల వాటా 17.8 శాతం అవుతుంది. ఇదంతా విభాజ్య నిధిలో చేరదు కనుక రాష్ట్రాలు తమకు దక్కాల్సిన దానిలో 8 శాతం వాటా కోల్పోయాయి. కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరి రాష్ట్రాల నిత్య అసంతృప్తికి కారణమవుతోంది. దీనికితోడు రూ.47,272 కోట్ల జీఎస్టీ పరిహార సెస్సు నిధులను ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ కింద ఇవ్వడం రాష్ట్రాలకు పుండు మీద కారం చల్లినట్లయింది. జీఎస్టీ వచ్చిన తొలి రెండేళ్లకు ఈ సెస్సు నిధుల్లో వాటా పొందడం వాటి న్యాయబద్ధమైన హక్కు. దాన్ని కూడా కేంద్రం గుర్తించలేదు. కేంద్రం ధోరణితో ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి.
35 రకాల సెస్సుల ఆదాయాన్ని ప్రాధాన్య ప్రాతిపదికన సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షించడమూ అంత తేలికైన వ్యవహారం కాదు. సమయం ప్రకారం సెస్సులపై సమీక్షించాల్సి ఉన్నా.. అలా చేయడం లేదు. దీంతో వసూళ్లు, వ్యయాలపై స్పష్టత లేకుండా పోయింది. చిన్నా చితకా సెస్సుల నిర్వహణ ఆర్థికంగా నష్టదాయం. రూ.50 కోట్ల ఆదాయం సైతం ఉండని సెస్సులను రద్దు చేయడం సబబు. ఒక సెస్సును కొనసాగించడం ఎంతవరకు సమంజసమో అనుభవం ప్రాతిపదికన నిర్ణయించాలి. సెస్సు నిధుల వినియోగానికి ఐదేళ్ల కాలపరిమితి పెట్టాలి. రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకొని ముందుకు సాగాలి. అప్పుడే సెస్సు నిధులు సద్వినియోగం అవుతాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: States have no share in cess collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com