తమిళనాడులో స్టాలిన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షాలకు సైతం విలువిచ్చి వాటికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని భావించారు. అందుకే ఆయన దయార్థ హృదయంపై అందరు వేనోళ్ల పొగుడుతున్నారు. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు పాలించిన జయలలిత, కరుణానిధి విధానాలను పాటించకుండా తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒకేలా చూస్తున్నారు. అందుకే ఓ వెలుగు వెలుగుతున్నారు. జయలలిత, కరుణానిధి ముందే వెళ్లిపోయారు. డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు సానుభూతి అస్ర్తాలు లేవు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. తర్వాత అమ్మ క్యాంటిన్లు కొనసాగిస్తానని చెప్పారు.
కరోనా సంక్షోభాన్ని నియంత్రించేందుకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో ఓ కమిటీ వేశారు. సీఎం హోదాలో స్టాలిన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఆహ్వానించదగినదే. దీనికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బీజం పడింది. సీఎం పళనిస్వామి తల్లి చనిపోతే పరామర్శకు స్టాలిన్ వెళ్లారు. పళనిస్వామి ఇంట్లో దాదాపు అరగంట కూర్చున్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడికి స్వాగతం పలికారు.
అసెంబ్లీ సమావేశాల్లో కూడా హుందాతనంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి మీదా ఆరోపణలు చేయకుండా అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇదే విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసినా విధానపరంగా చూడాలే తప్ప వ్యక్తిగతంగా తీసుకోకూడదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఒకే విధంగా ఉండడం సామాన్య విషయం కాదు. అదే పద్ధతిలో సీఎం అయిన తరువాత కూడా పాటిస్తున్నారు.
పాత రాజకీయాలకు స్వస్తి పలికి నూతన పద్ధతికి స్వాగతం పలికారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై ఎన్ని దాడులు జరిగేవో, ఎంత గందరగోళం జరిగేదో అందరికీ తెలుసు. ఏమైనా పాత పద్ధతిలో కాకుండా కొత్త తరహా రాజకీయాలు చేయాలని భావించిన స్టాలిన్ నిర్ణయం సమంజసమే అని అందరు ప్రశంసిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రకు ద్వారాలు తెరిచారని కీర్తిస్తున్నారు. మనసున్న మారాజుగా వెలిగిపోతున్నాడు.