Srikanth Chary Mother Shankaramma: తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామవాసి శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లభించింది. పదేళ్లుగా ఏటా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నా.. శంకరమ్మను అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. ఇక శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వభించడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ తెలంగాణ అమరులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఉద్యమకారులను కాదని ఉద్యమద్రోహులను అందలం ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కేసీఆర్‌కు తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి గుర్తొచ్చింది. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శంకరమ్మకు గన్‌మెన్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్మృతివనం ఆవిష్కరణకు ఆహ్వానం
అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని ప్రభుత్వం నుంచి శంకరమ్మకు అధికారికంగా ఆహ్వానం కూడా అందింది. అందులో భాగంగానే బుధవారం బీఆర్‌ఎస్ అధినేతను ఆమె కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక పదవి శంకరమ్మకు ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరులు గుర్తొచ్చారు..
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాలా రోజుల తర్వాత అమరులు గుర్తొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లకు అమరుల స్మృతివనం నిర్మాణం పూర్తిచేయించారు. ఆయనకు అవసరమైన ప్రగతిభవన్, సెక్రటేరియేట్ ఏడాది రెండేళ్లలో నిర్మించుకున్న కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయించిన గులాబీ బాస్ అమరుల స్తూపంపై మాత్రం చిన్నచూపు చూశారు. ప్రతిపక్షాలు కేసీఆర్ తీరును ఎండగట్టడం, మరోవైపుకేసీఆర్ ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తున్నారన్న అపవాదు కూడా ఉంది. ఈ క్రమంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో కేసీఆర్‌కు సడెన్‌గా అమర వీరులు గుర్తొచ్చారు. ఇన్నాళ్లూ తానొక్కడినే తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్‌సార్.. ఇప్పుడు అమరులకు నమస్కరించాలన్న ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు చేస్తున్న అన్యాయమే రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుందని భావించిన కేసీఆర్ శంకరమ్మకు శాసనమండలి సభ్యురాలిగా ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా శంకరమ్మకు ఓ పీఏ, గన్‌మెన్‌గా ఓ కానిస్టేబుల్‌తోపాటు ఆమెకు ప్రభుత్వ వెహికల్ కేటాయించినట్లు సమాచారం. గురువారం నుంచి పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆమెకు అధికారులు సూచించినట్లు తెలిసింది.