TDP MP Ram Mohan Naidu: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలి టీడీపీలో, ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపీగా అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయ అరంగేట్రం చేసిన రామ్మోహన్ నాయుడు యంగ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకిదిగి రెడ్డి శాంతిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా ఇక్కడ మాత్రం ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్ స్థానంలోని ఎనిమది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయినా ఎంపీగా సమీప వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై గెలుపొందారు. అటు అధిష్టానం వద్ద ప్రత్యేక గౌరవం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఆయన ఎంపీగా బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన ఇప్పుడు అసెంబ్లీ సీటుపై గురిపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా పెద్దగా గుర్తింపు లభించలేదన్నది ఆయన కుటుంబసభ్యలు, అనుచరుల భావన. జాతీయ రాజకీయాల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రాష్ట్ర మంత్రిగా చూడాలని ఆయన సొంత కుటుంబసభ్యలు ఆలోచిస్తున్నారుట. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు ఇదే విషయాన్ని చంద్రబాబు చెవిలో పడేశారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న టాక్ నడుస్తోంది. అటు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారని.. స్థానిక నియోజకవర్గ ఇన్ చార్జి బగ్గు రమణమూర్తి సైతం ఒప్పుకున్నట్టు సిక్కోలు రాజకీయ వర్గాల్లో టాక్ అయితే నడుస్తోంది.
ఇద్దరికీ మంత్రి పదవులు సాధ్యమేనా?
అయితే ఇది సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. టెక్కలి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా.. టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి తప్పనిసరిగా లభిస్తుంది. ఆయన్ను కాదని రామ్మోహన్ నాయుడుకు ఇచ్చే అవకాశం ఉందా? అన్న అనుమానమైతే ఉంది. పోనీ రామ్మోహన్ నాయుడును అసెంబ్లీ బరిలో దించుతారు అనుకుంటే ఎంపీగా పోటీచేసే వారు ఎవరు? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అచ్చెన్నాయుడిని అడిగితే నేను పోటీచేయను అంటూ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. బాబాయ్ అబ్బాయిలిద్దరూ పోటీచేసి గెలుపొందితే మాత్రం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరే అవకాశముందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ అంశాన్ని సుతిమెత్తగా పరిష్కరించాలని అధినేత చూస్తున్నట్టు సమాచారం.
Also Read: YS Vivekananda Reddy: మూడున్నరేళ్లవుతున్నా కొలిక్కిరాని వివేకా హత్య కేసు.. అందుకు కారణాలు అవేనా?
శ్రేణుల్లో గందరగోళం…
మరోవైపు రామ్మోహన్ నాయుడు నిర్ణయం శ్రీకాకుళం టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేయాలనుకుంటున్న వారు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు బరిలో ఉంటేనే పార్టీకి అడ్వాంటేజ్ అని వారు భావిస్తున్నారు. పార్టీలో బాబాయ్ కంటే అబ్బాయికే క్లీన్ ఇమేజ్ ఉంది. యువత ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. రాజకీయాలకతీతంగా రామ్మోహన్నాయుడుకు ఓటు వేస్తుంటారు. అందుకే ఎంపీగా పోటీచేస్తే తమకు లాభిస్తుందని వారు భావిస్తున్నారు. కానీ ఆయన అసెంబ్లీ స్థానానికి మొగ్గుచూపుతుండడంతో వారు తెగ బాధపడిపోతున్నారు. దీనిపై అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నాయి. అయితే ఇదంతా ఊహాగానమే అని పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం నరసన్నపేట అసెంబ్లీ స్థానం ప్రత్యేకంగా దృష్టిసారించడం చూస్తుంటే మాత్రం వాస్తవమేనని తెలుస్తోంది. మొత్తానికైతే సిక్కోలు రాజకీయ సమీకరణలు మారేలా రామ్మోహన్ నాయుడు వ్యవరిస్తుండడం ఇప్పడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది.