Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి మామూలోడు కాదు.. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకుంటారు. తాజా ఐటీ దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలతో అధికారుల కళ్లే బైర్లు కమ్ముతున్నాయి. ‘వీడు మామూలోడు కాదు’ అని ఆశ్చర్యపోతున్నారు. తన డబ్బులు దాచుకోవడానికి మల్లారెడ్డి ఏకంగా బ్యాంకే పెట్టుకున్నాడంటే.. అతని రోజువారీ వ్యాపార దేవీలు ఎంత భారీగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

దాడుల్లో కీలక అంశాలు..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన బంధువులు, వ్యాపారాలు, కాలేజీలపై రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నానయి. ఏకకాలంలో మల్లారెడ్డి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై, ఆయన కూతురు, ఇద్దరు కుమారులు, ఆయన బంధువుల ఇళ్లపై 50 బృందాలు మంగళవావరం నుంచి దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధించిన అనేక కీలక విషయాలు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా మల్లారెడ్డి సొంత వ్యాపారాల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు.
సొంత బ్యాంకుతో లావాదేవీలు..
మల్లారెడ్డి తనకు చెందిన ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇతర వ్యాపారాలకు చెందిన లావాదేవీలు మొత్తం ఓ బ్యాంకు ద్వారా కొనసాగిస్తున్నారు. ఊరు పేరు లేని ఒక చిన్న కో–ఆపరేటివ్ బ్యాంకునే మల్లారెడ్డి పెట్టుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మల్కాజ్‌గిరిలో ఉన్న క్రాంతి బ్యాంక్ కేంద్రంగా మల్లారెడ్డికి చెందిన వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయని ఐటీ అధికారులు నిర్ధారించారు. దీంతో అధికారులు సదరు బ్యాంకును జల్లెడ పడుతున్నారు.
బ్యాంక్ చైర్మన్ ఇంట్లోనూ ఐటీ సోదాలు..
మల్లారెడ్డికి బ్యాంకు ఉందని తెలియడంతో క్రాంతి బ్యాంకులోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంకు చైర్మన్ మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి అని సమాచారం. ఇక క్రాంతి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థల చైర్మన్ వి.రాజేశ్వరగుప్త ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలానగర్ రాజు కాలనీలోని ఆయన నివాసానికి చేరుకున్న అధికారుల బృదం ఆయన ఇంట్లో కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. క్రాంతి బ్యాంకు నుంచి స్థిరాస్తి వ్యాపారానికి నిధులు దారి మళ్లాయని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రాంతి బ్యాంకుతో పాటుగా, బ్యాంకు చైర్మన్ ఇంటిపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు.

లెక్కలేనన్ని వ్యాపార లావాదేవీలు..
సోదాల సమయంలో మల్లారెడ్డి ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయన తన మొబైల్ ఫోన్ ఐటీ అధికారులకు చిక్కకుండా దాచిపెట్టారు. ఇక సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పక్క ఇంట్లో ఒక గోనెసంచిలో మల్లారెడ్డి ఫోన్ ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇలా లెక్కలేనన్ని వ్యాపార లావాదేవీలు ఉండటంతో ఐటీ సోదాలలో ఏం దొరుకుతాయో అన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
క్రాంతి బ్యాంకుపైనే ఫోకస్..
మల్లారెడ్డి కి సంబంధించిన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఎవర్ని వదలకుండా ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి చేసిన మూకుమ్మడి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.5 కోట్ల నగదు, అనేక కీలకమైన పత్రాలు, ఆస్తిపాస్తులు వివరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సోదాల్లో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన తీవ్రమైన నేరాలు ఏవైనా బయటపడితే అరెస్టుల వరకూ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రాంతి బ్యాంకు వ్యవహారాల్లోనే తేడాలు కనిపిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే మంత్రి మల్లారెడ్డిపై సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.