CM KCR- IT Raids: నిన్న హడావుడిగా దగ్గరున్న మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసర మీటింగ్ పెట్టిన కేసీఆర్ కేవలం ఒక కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రం దాడులపై ఏం స్పందించలేదు. కానీ ఏదో ఒకటి ప్లాన్ చేశారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నిన్నటి నుంచి మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ శాఖల వరుస దాడులు కలకలం రేపాయి. ఈ దాడులపై సమాచారం రాగానే సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడి మంత్రి మల్లారెడ్డికి ధైర్యం చెప్పారు. కేంద్రం వైఖరిపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది.

-కేంద్రం ఐటీ, ఈడీ దాడులపై ప్రజల్లోకి..
కేంద్ర ప్రభుత్వం ఐటీ ఈడీ దాడులను ప్రజల్లోనే తేల్చుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని కేసీఆర్ సేకరిస్తున్నారు. వాటి పూర్వాపరాలను అందరి ముందు ప్రస్తావించి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
-ఢిల్లీ వేదికగా ఎండగట్టే ప్లాన్?
కేంద్ర ఐటీ, ఈడీ ప్రతీకార దాడులపై ఢిల్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దాడుల నివేదికను కూలంకషంగా పరిశీలించి దేశవ్యాప్తంగా బీజేపీ ఎలా ప్రత్యర్థులను వేధిస్తుందన్న దానిపై జాతీయ మీడియా ముందు ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ బీజేపీని ఢిల్లీలోనే నిలదీయడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది.

-కౌంటర్ దాడులు షురూ
ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన వారందరినీ అరెస్ట్ చేసే దిశగా తెలంగాణ సర్కార్ కదులుతోందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేస్తే అది జాతీయ స్థాయి వార్త అవుతుందని.. బీజేపీకి ఇది పెద్ద దెబ్బగా కేసీఆర్ చూస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఇతర శాఖలతో కలిసి రాష్ట్ర బీజేపీ నేతలపై దాడులకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు.
ఇలా కేంద్రం దాడులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతీకార చర్యలతో తెలంగాణ అట్టుడుకుతోందనే చెప్పాలి. మరీ ఈ వ్యవహారం ఎటు వైపు దారితీస్తుందో వేచిచూడాలి.