Homeజాతీయ వార్తలుAssembly Fight: సిర్పూర్‌ గడ్డపై బహుజన వాదం.. ఆర్‌ఎస్‌పీ ఎంట్రీ.. టెన్షన్‌ లో లక్కీ సీటు!*

Assembly Fight: సిర్పూర్‌ గడ్డపై బహుజన వాదం.. ఆర్‌ఎస్‌పీ ఎంట్రీ.. టెన్షన్‌ లో లక్కీ సీటు!*

Assembly Fight: తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్‌ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కసారి ఇక్కడ గెలిస్తేచాలు రెండోసారి కూడా వాళ్లదే విజయం. ఇది తథ్యం అంటారు ఇక్కడి ఓటర్లు. అంతేకాదు శాసనసభ నియోజకవర్గం తొలి నంబర్‌ ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌కి దక్కడం మరో విశేషం. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారింది.

నాడు టీడీపీ వర్సెస్‌ కాంగ్రెస్‌..
సిర్పూర్‌.. ఈ పేరు వినగానే వెంటనే పేపర్‌ మిల్లు గుర్తుకువస్తుంది. సిర్పూర్‌ – కాగజ్‌ నగర్‌ పేపర్‌ మిల్లుకి పేరు గాంచింది. నియోజకవర్గాల పునర్‌వ్యవస్ధీకరణలో భాగంగా ఇది కొమురం భీం జిల్లా కిందకు వచ్చింది. కౌటాల, బెజ్జూర్, కాగజ్‌ నగర్, సిర్పూర్, దహేగావ్, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి మండలాలతో ఏర్పడిన ఈ నియోజవర్గంలో దాదాపు లక్షన్నర వరకు ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు టీడీపీ – కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోరు ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర విభజనతో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) ఇక్కడ బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో గులాబీపార్టీ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్‌ వాదీ నుంచి గెలుపొందిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి సిర్పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప రానున్న ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రెండుసార్లు గెలిచే ఆనవాయితీ..
సిర్పూర్‌ ఓటర్లకు వరసగా రెండుసార్లు అభ్యర్థులను గెలిపించే ఆనావాయితీ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే కోనేరు కోనప్ప రెండుసార్లు గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారా లేదా అన్నది ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. ఇక నియోజకవర్గం విషయానికొస్తే అధికారపార్టీ తరపున కోనేరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న టాక్‌ ఉంది. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు కోనేరు కోనప్పపై ఉన్నాయి. పట్టణంలో డంప్‌ యార్డ్‌ కోసం కేటాయించిన స్థలాన్ని అధికార పార్టీ అండదండలతో వెంచర్లుగా మార్చి అమ్మేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వాదన ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. అలాగే కొన్ని నెలల క్రితం అటవీభూముల సాగు విషయంలో కోనేరు కోనప్ప సోదరుడు అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడులకు దిగడం రాజకీయ వివాదంగా మారింది.

పూర్తికాని ప్రాజెక్టులు..
మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టు ఇంతవరకు పూర్తికాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దీని పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాదాపు 15 ఏళ్లుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావాసుల కల కలగానే మిగిలిపోతోంది. ఫలితంగా తాగు, సాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.

బీఎస్సీకి పట్టు..
2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచే కోనేరు కోనప్ప గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ ఓట్లే కీలకంగా మారడంతో రాజకీయపార్టీల చూపంతా ఆ వర్గంపై పడింది. తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంపై పట్టుసాధించే ప్రయత్నాలకు వ్యూహరచన చేశారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు ఉండటంతో కార్మిక కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మినీ ఇండియాగా పిలవబడే సిర్పూర్‌ లో దేశంలోని అన్నీ ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఒక్కో రాష్ట్రం వారిది ఒక్కో కాలనీ ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణేతరుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సిర్పూర్‌ – కాగజ్‌ నగర్‌ ఫ్యాక్టరీ కారణంగా ఇక్కడ స్థిరపడినవారు ఎక్కువే ఉన్నారు.

పుంజుకుంటున్న బీజేపీ,..
ఇంకోవైపు బీజేపీ బలపడటానికి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను రారమ్మని ఆహ్వానిస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ నుంచి కీలకనేతలు కొందరు ఇప్పటికే బీజేపీలో చేరారు. అంతేకాదు ప్రజా సంగ్రామ యాత్రలతో ఇక్కడ బీజేపీ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కి, బీఎస్పీకి చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్‌ ఇక్కడ అంతగా ప్రభావం చూపలేకపోవడంతో రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎస్సీ, మైనారిటీ ఓట్లే కీలకం..
సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, బీసీ, మైనారిటీ ఓటు శాతం అధికం. ముఖ్యంగా ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పక్షాన నిలవడంతో ఆయన విజయం సాధించారు. 2014లో బీఆర్‌ఎస్‌ హవాలోనూ బీఎస్పీ నుంచి పోటీ చేసిన కోనప్ప అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయం సాధించారు. ఆపై బీఆర్‌ఎస్‌ చేరిన కోనప్ప 2018లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, రానున్న ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న కోనప్పకు బీజేపీ లీడర్‌ పాల్వాయి హరీశ్‌బాబు నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. తండ్రి పాల్వాయి పురుషోత్తం ఓటు బ్యాంకుతోపాటు బీజేపీ సంప్రదాయ ఓట్లను కాపాడుకునేలా ఆయన ఏడాది కాలంగా సిర్పూర్‌ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నేత రావి శ్రీనివాస్‌ టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సిర్పూర్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం నియోజకవర్గ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య చతుర్ముఖ పోరు తప్పేలా లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో సిర్పూర్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular