Telangana Elections 2023: కమ్మవారికి “పాలేరు”లో పెద్ద పరీక్ష

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని ఆదేశాలు రావడం.. ఫలితంగా టిడిపి కార్యకర్తలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు హస్తానికి జై కొడుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 24, 2023 12:59 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: ఖమ్మం జిల్లాలో జనరల్ అసెంబ్లీ స్థానమైన పాలేరు పై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ అసెంబ్లీ స్థానం మొదట్లో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ దానిని ఆక్రమించింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎస్టి ఓటర్లు, ఎస్సీ ఓటర్లు, బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు మాత్రం గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులు మొత్తం తమ సామాజిక వర్గం కావడంతో కమ్మ ఓటర్లు సహజంగానే అటువైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయకపోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రస్తుతం వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

పోటీ చేయకపోవడంతో..

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని ఆదేశాలు రావడం.. ఫలితంగా టిడిపి కార్యకర్తలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు హస్తానికి జై కొడుతున్నారు. అయితే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏపీలో కొన్ని వర్కులు చేస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గం శ్రీనివాస్ రెడ్డికి ఎలా ఓటు వేస్తుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. టిడిపి అధిష్టానం కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పినప్పటికీ.. ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండడంతో వారు ఒకింత డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా శ్రీనివాస్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినది కావడంతో వారు ఒకింత విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో ఏం జరిగింది..

గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం రెండవ మాటకు తావులేకుండా కందాల ఉపేందర్ రెడ్డికి జై కొట్టింది. ఫలితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లారు. ప్రస్తుతం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. ఈ ఐదు సంవత్సరాలు కూడా పలు కీలక పదవుల్లో కమ్మ సామాజిక వర్గం వారిని నియమించారు. అయితే ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా తనకు ఓట్లు వేస్తారని ఆయన నమ్ముతున్నారు.. మరోవైపు కమ్యూనిస్టు నాయకుడు తమ్మినేని వీరభద్రం, బిజెపికి చెందిన నున్న రవికుమార్ పోటీలో ఉండటం.. వీరంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. సాధారణంగా కమ్మ ఓట్లు మొత్తం వీరిద్దరికి బదిలీ అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం వారిని కందాల ఉపేందర్ రెడ్డి దగ్గరికి తీశాడు కాబట్టి .. ఈసారి కూడా ఆయనకే ఓట్లు వేస్తారని మరికొంతమంది అంటున్నారు. టిడిపి ఇక్కడ పోటీ చేయలేకపోవడం, జగన్కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేయాలంటే మన సొప్పకపోవడం.. వంటి పరిస్థితుల మధ్య కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. మరి వారు కందాల ఉపేందర్ రెడ్డి కి వేస్తారా? లేక తమ్మినేని వైపు మొగ్గు చూపుతారా? ఎన్డీఏ లోకి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి కమలం వైపు చూస్తారా అనేది డిసెంబర్ 3న తేలనుంది