Gulzari Lal Nanda Jayanti: రాజకీయమంటే సంపాదనకు మార్గంగా మారిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయడం.. ఓటర్లకు గాలం వేసి గెలవడం.. పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు సంపాదించుకోవడం.. వ్యవస్థలను నాశనం చేయడం.. వనరులను దోపిడీ చేయడం.. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని కాదు.. దేశం మొత్తం ఇదే పరిస్థితి. గల్లి స్థాయిలో కార్పొరేటర్ నుంచి ఢిల్లీ స్థాయిలో పెద్దపెద్ద మంత్రుల దాకా అందరూ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. పైగా దీనిని తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విలువలు పాటించవలసిన వ్యక్తులు వలువలు వదిలేస్తూ.. రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. అయితే రాజకీయాలు అత్యంత అవినీతి మయంగా మారిపోయిన నేటి రోజుల్లో.. ఓ వ్యక్తి గురించి కచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు చదవాలి. ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి.. ఇంతకీ ఆయన ఎవరంటే..
చాలామందికి మనదేశంలో తొలి ప్రధాని ప్రస్తావనకు రాగానే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరును గొప్పగా చెబుతారు. వాస్తవానికి వ్యక్తి పూజ వల్ల మన దేశానికి రెండవ ప్రధానిగా పని చేసిన మహనీయుడి గురించి తెలియకుండా పోయింది. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా (తాత్కాలికంగా) గుల్జారీ లాల్ నందా పనిచేశారు. ఆయన 1964, 1966 కాలంలో రెండుసార్లు దేశానికి తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేశారు. జూలై 4న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలో విశేషాల గురించి ఒకసారి పరిశీలిస్తే..
నెహ్రూ మరణం తర్వాత నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత తాష్కెంట్ లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి మరణించిన నేపథ్యంలో.. నందా 1966 జనవరి 11న మరోసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా.. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ..నందా కు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. ఉంటున్న ఇల్లు అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అద్దె చెల్లించకపోవడంతో నందాను ఇంటి యజమాని బయటికి వెళ్ళగొట్టాడు. అయితే ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను ఆయన వద్దకు పంపించింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే ₹500 భృతి ని తీసుకునేందుకు నందాను అతి కష్టం మీద ఒప్పించారు. చివరికి ఆ ఇంటి యజమానికి నందా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని తెలియడంతో క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత తన 99 ఏట నందా 1988 జనవరి 15న పరమపదించారు.