Chhattisgarh- Mizoram Elections: ఛత్తీస్ గఢ్.. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ సారి అధికార పీఠం ఎక్కేది ఎవరు? 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్.. రెండోసారి విజయంపై ధీమాగా ఉండగా.. ఘన విజయంతో మళ్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లో హోరాహోరీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ గెలుపుపై కాంగ్రెస్ ధీమా
90 సీట్లున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంతకుముందు వరసగా 15 ఏళ్ల పాటు బీజేపీ సీఎం రమణ్‌సింగ్ హవా కొనసాగింది. 2018లో మాత్రం ఏకంగా 68 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 15 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక మాజీ సీఎం అజిత్ జోగి ఏర్పాటు చేసిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుంది. ఈ పార్టీతో జత కట్టిన బీఎస్పీ 2 సీట్లు దక్కించుకుంది. సంక్షేమ పథకాలు, సీఎం భూపేశ్ బఘేల్‌కు ఉన్న ప్రజాదరణతో రెండోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. నవంబరు 7, 17న రెండు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి 75 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సత్తా చాటుతామంటున్న బీజేపీ
ఛత్తీస్ గఢ్ అధికార పీఠాన్ని మళ్లీ దక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల వ్యూహాలను మార్చేస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగం అంశాలతో అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను తమకు అనుకూలంగా మార్చుకొని ఛత్తీస్ గఢ్ లో మళ్లీ అధికారంలోకి రావాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో మోదీ 4 సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. కాంగ్రె్‌సపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే ఛత్తీస్ గఢ్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
ఛత్తీస్ గఢ్‌లో లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. అయితే ఆప్, కొన్ని ప్రాంతీయ పార్టీలతో అధికార కాంగ్రెస్ కు కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2018లో బోణీ కొట్టలేకపోయిన ఆప్.. ఈ సారి ఎలాగైనా ఖాతా తెరవాలని భావిస్తోంది. ఇక సర్వ ఆదివాసీ సమాజ్ అనే గిరిజన సంఘాల సంస్థ కూడా ఎన్నికల బరిలో నిలవనుంది. హమర్ రాజ్ పేరిట పార్టీని స్థాపించిన సంస్థ.. 50 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించింది. అలాగే గిరిజనుల కోసం పనిచేసే గోండ్వానా గణతంత్ర పార్టీ కూడా కీలకంగా మారనుంది. ఈ పార్టీల వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈశాన్య మిజోరంలో గెలిచేది ఎవరో?
కొన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 1987లో మిజోరం రాష్ట్రంగా అవతరించింది. అప్పటినుంచి ఈ ఈశాన్య రాష్ట్రాన్ని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), కాంగ్రెస్ పార్టీలే పాలించాయి. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అంచనాలను తలకిందులు చేస్తూ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) సత్తా చాటడంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే అధికార ఎంఎన్‌ఎఫ్, ప్రతిపక్ష జెడ్‌పీఎం మధ్యే ప్రధాన పోటీ నడుస్తుందని తెలుస్తోంది. వచ్చే నెల 7న రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 37.7 ఓట్ల శాతంతో 26 స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేపట్టగా.. 30 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది. ఇక 22.9 శాతం ఓట్లను సాధించిన జెడ్‌పీఎం ఊహించని రీతిలో 8 స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. బీజేపీ ఒక్క చోటే గెలిచింది.
ఎంఎన్‌ఎఫ్ కు అవి అనుకూలం.
జోరమ్‌తంగా నేతృత్వంలోని అధికార ఎంఎన్‌ఎఫ్ వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకం (ఎస్‌ఈడీపీ) అధికారిక పార్టీ ఎంఎన్‌ఎఫ్ కు లబ్ధి చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొత్త పంథాలో జెడ్‌పీఎం దూసుకెళ్తోంది. ప్రస్తుతమున్న వ్యవస్థకు పూర్తి భిన్నమైన రాజకీయ వ్యవస్థను తెస్తామని ఆ పార్టీ ప్రకటించడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎంఎన్‌ఎఫ్ గ్రామీణ ప్రాంతాల్లో.. జెడ్‌పీఎం పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ కొత్త చీఫ్ లాల్‌సవ్తా యువ నాయకులకు ప్రాధాన్యమిస్తూ పార్టీలో సంస్కరణల తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న మణిపూర్‌లో అధికారంలో ఉండి అల్లర్లను నియంత్రించకపోవడం, శరణార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో.. బీజేపీకి ఆదరణే కరువైంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Special article on chhattisgarh mizoram elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com