Homeజాతీయ వార్తలుAssembly Fight: ఆ ఇద్దరి మధ్యే ఆదిలా ' బాద్ షా ' ఫైట్!

Assembly Fight: ఆ ఇద్దరి మధ్యే ఆదిలా ‘ బాద్ షా ‘ ఫైట్!

Assembly Fight: అక్షరమాలలో మొదటి అక్షరంలో ప్రారంభమయ్యేది ఆదిలాబాద్‌. రాష్ట్రం మ్యాప్‌లో కూడా అగ్రభాగాన ఉన్న జిల్లా ఆదిలాబాద్‌. రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంగా ఆదిలాబాద్‌ జిల్లాకి పేరుంది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో ఈ జిల్లా కిందకి మూడు నియోజకవర్గాలు వచ్చాయి. అందులో ఆదిలాబాద్‌ ఒకటి. దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్న ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మూడు మండలాలుగా బేల, ఆదిలాబాద్, జైనథ్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారం బీఆర్‌ఎస్‌ పార్టీదే. జోగు రామన్న వరసగా మూడుసార్లు విజయం సాధించారు. ఒకసారి టీడీపీ తరఫు, రెండుసార్లు ఈ పార్టీ తరపున గెలిచారు.

అన్ని పార్టీల ఆధిపత్యం.
ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని పార్టీలు ఆధిపత్యం చెలాయించాయి. జిల్లా ఏర్పడినప్పుడు మొదట్లో సీపీఐ హవా నడిచింది. ఆ తర్వాత ఇది కాంగ్రెస్‌ అడ్డాగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో హస్తం స్పీడు తగ్గింది. సైకిల్‌ స్పీడుకి మిగిలిన పార్టీలన్నీ సైడ్‌ అయిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కారు హవా మొదలైంది. టీడీపీలో ఉన్న జోగు రామన్న గులాబీ పార్టీలోకి చేరి ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో జోగు రామన్న కేసీఆర్‌ కేబినెట్‌ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన గెలిచినప్పటికీ కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.

బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి..
ప్రస్తుతం ఇక్కడ అధికారపార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన కేడర్‌ ఉంది. మున్నూరుకాపు, మైనార్టీ ఓటర్ల అండ ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో జోగురామన్న పనితనం చూపించడం లేదన్న విమర్శలున్నాయి. వివాదరహితుడిగా పేరున్నా వర్గపోరుతో సతమతమవుతున్నారు. గులాబీ నేతలంతా నియోజకవర్గంలో కన్నా హైదరాబాద్‌ లోనే ఎక్కువగా ఉంటారన్న వాదన ఉంది. ఈ మధ్యనే సీఎం కేసీఆర్‌ కూడా రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా ఆయా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. అయితే ఈ మాటని ఆదిలాబాద్‌ నియోజకవర్గ నేతలు సీరియస్‌గా తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.

పెండింగ్‌లోనే పనులు..
ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నప్పటికీ లబ్ధిదారులకు చేరడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఆశించిన స్థాయిలో అర్హులకు అందలేదు. ఇక సాగు, తాగునీటి సమస్యతో ఈ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 50 వేల ఎకరాలకు పైగా సాగు నీరందించే చనాఖా కోర్టా ప్రాజెక్టు, నేరడిగొండలో దాదాపు 20 వేల ఎకరాలకు నీరందించే కుప్టీ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఇది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటే పోతే ఆదిలాబాద్‌ నియోజవర్గంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. పట్టణం వరకు అయితే అభివృద్ధి బాగుంది కానీ గ్రామాల్లో అయితే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సరైన రవాణా వసతి కూడా లేకపోవడంతో గర్భిణిలు ప్రాణాలు వదిలిన సందర్భాలు కోకల్లలు.

రామన్నకు ఇంటిపోరు..
రానున్న ఎన్నికల్లో సీటు కోసం జోగు రామన్నతోపాటు ఈసారి లోక భూమారెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా భూమారెడ్డికి పేరుంది. దీనికి తోడు మంత్రి పదవి ఇవ్వలేదని జోగురామన్న కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉండటంతో కేసీఆర్‌ కూడా ఆయనపై గుస్సాగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ లెక్కలన్నీ చూసుకున్న భూమారెడ్డి ఈసారి ఆదిలాబాద్‌ టిక్కెట్‌ ఆశిస్తూ అందుకు తగ్గ వ్యూహరచనతో రాజకీయాలు మొదలెట్టారట.

కమలంలో గెలుపుపై గంపెడాశలు..
ఇక్కడ జోగు రామన్నకు కమలం గట్టి పోటీ ఇస్తుంది. 2014, 2018 ఎనినకల్లో బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఓడించినంత పని చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గం ఇదే. అధికార పార్టీలో ఇంటిపోరును ఈసారి తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పై గురిపెట్టింది ఆ పార్టీ. డబుల్‌ ఇంజి¯Œ సర్కార్‌ నినాదంతో నియోజకవర్గంలో గెలుపు కోసం కాషాయం శతవిధాలుగా పనిచేస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నేపథ్యంలో సానుభూతి కూడా ఈసారి గెలిపిస్తుందని పాయల్‌ శంకర్‌ ధీమాతో ముందుకెళ్తున్నారు.

మసకబారిన కాంగ్రెస్‌ పార్టీ
జాతీయపార్టీగా ఒకప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా మసకబారిపోయింది. హస్తానికి బలమైన కేడర్‌ ఉన్నా దమ్మున్న నాయకుడు లేకపోవడంతో ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్‌ నియోజవర్గంలో ఇప్పుడ కాంగ్రెస్‌ పరిస్థితి అంతంత మాత్రమే. రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టినా ఆ ప్రభావం ఇక్కడ ఏ మాత్రం కనిపించడం లేదు. పాదయాత్రలో తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతన్న మాటలు ఏ మేర ప్రభావం చూపుతాయో అన్నది సందేహమే. చెప్పుకోవడానికి పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ ఎన్నికల పోరు మాత్రం బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అనే మాట ఈ నియోజవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈసారి జోగు రామన్నకు మళ్లీ చాన్స్‌ ఇస్తారా.. లేక పాయల్‌కు పట్టం కడతారా అనేది చూడాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ సీటు బీజేపీతో గెలిచింది. ఈసారి ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామనే ధీమా కమలంపార్టీకి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular